భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ ఇంటి పార్టీ, సీపీఎం.. ఈ పార్టీలన్నీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీచేయడం ఖాయమైంది. వీటి తరఫున అభ్యర్థులకు సంబంధించి ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇవేవీ గెలిచే ఛాన్సులు ఉన్న పార్టీలు కావని.. అయితే ఇవి చీల్చే ఓట్లు ప్రధాన పోటీదారులు అయిన కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఎవరి ఓట్లను చీలుస్తాయనేదే ఆసక్తిదాయకమైన అంశం అని విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాన పోటీ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్యనే అని కేటీఆర్ కూడా ప్రకటించుకున్నారు. ఇరుపార్టీల మధ్యన కొంత శాతం ఓట్ల తేడా ఉంటుందని ఆయనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బైపోల్ లో పోటీకి చాలా పార్టీలు రెడీ అయిపోయాయి. భారతీయ జనతా పార్టీకి పెద్ద పరీక్షే అయినా.. ఈ ఉప ఎన్నికల్లో పాల్గొని గరిష్టంగా ఆ పార్టీ ఓట్లను చీల్చడం ఖాయమైనట్టే.
ఇక కొద్ది మేర కమ్మ వాళ్ల జనాభా ఈ నియోజకవర్గంలో ఉందట. అందుకే తెలుగుదేశం పోటీ చేసిందని టాక్. ఇక టీవీ యాంకర్ తీన్మార్ మల్లన్న కూడా ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నాడు. తెలంగాణ ఇంటి పార్టీ ఆయనకు మద్దతు పలికిందట. ఇక ఒక కమ్యూనిస్టు పార్టీ పోటీకి రెడీ అయిపోగా.. రెండో పార్టీ ఇంకా ఆలోచిస్తోందట.
నేటి నుంచి ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో గెలిచే, ఓడే పార్టీల హడావుడే కాకుండా.. ఓట్లను చీల్చడమే పనిగా దిగుతున్న పార్టీల హడావుడి కూడా గట్టిగానే ఉండేలా ఉంది.