శతమానం భవతి సినిమాతో మాంచి ఫీల్ గుడ్ సినిమా అందించారు దర్శకుడు సతీష్ వేగ్నిశ. ఆ తరువాత శ్రీనివాస కళ్యాణంతో రివర్స్ గేర్ లో పడ్డారు. ఇప్పుడు లేటెస్ట్ గా హీరో కళ్యాణ్ రామ్ తో 'ఎంత మంచి వాడవురా?' అనే సినిమా చేస్తున్నారు. ఇది కూడా ఫీల్ గుడ్ సినిమానే. ఈ సినిమా కథ, కథనాలు ఇంకా బయటకు రాకున్నా, ఓ గుజరాతీ సినిమా దీనికి ఆధారం అని తెలుస్తోంది.
గత ఏడాది గుజరాతీ భాషలో ఆక్సిజన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కథ ఇలా సాగుతుంది. జీవితమే ఒక నాటకరంగం, మన మంతా పాత్రధారులం అనే మాట ను నమ్ముతూ, ఇతరులకు సాయం చేయడం కోసమే మన బతుకు అనే పద్దతిలో జీవించే వ్యక్తి షేక్స్ పియర్ జోషి.
ఇతగాడు జీవితమే ఓ నాటకరంగం అని అనుకోవడానికీ ఓ రీజన్ వుంది. అతగాడు పుట్టిందే తల్లి నాటకం వేస్తుంటే, స్టేజ్ మీద. ఎవరు కష్టాల్లో వున్నారు, అవసరంలో వున్నారు, బాధల్లో వున్నారు అంటే వాళ్లింటికి వెళ్లి, వారిని తనవాళ్లు అనుకుని, వాళ్ల సమస్య లేదా అవసరాన్ని తీర్చడంలో ఆనందం పొందుతుంటాడు. ఇదీ కాన్సెప్ట్.
ఇప్పుడు ఈ పాయింట్ తోనే కళ్యాణ్ రామ్ సినిమా కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. సతీష్ వేగ్నిశ స్టయిల్ కు అచ్చంగా నప్పే కథ. మరి ఈ విషయం ఎంత వరకు కరెక్ట్ అనేది మరికొంత కాలం వెయిట్ చేస్తే బయటకు వస్తుంది.
సినిమాను సంక్రాంతి విడుదల దిశగా రెడీ చేస్తున్నారు. సతీష్ వేగ్నిశ కు వున్న పేరు, సంక్రాంతి సీజన్, ఫ్యామిలీ ఫిల్మ్ కావడంతో బాగానే టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తోంది సినిమా.