బంగార్రాజు మీద అన్నీ వదంతులేనా?

నాగార్జున కు సంబంధించినంత వరకు బంగార్రాజు ఓ క్రేజీ ప్రాజెక్టు. ఆయన ఫుల్ క్లారిటీతో వున్నారు. కానీ సమస్యలు తప్పలేదు. ముందు ఎన్నికలు వచ్చాయి. డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు ఎన్నికల్లో పోటీ చేయడంతో…

నాగార్జున కు సంబంధించినంత వరకు బంగార్రాజు ఓ క్రేజీ ప్రాజెక్టు. ఆయన ఫుల్ క్లారిటీతో వున్నారు. కానీ సమస్యలు తప్పలేదు. ముందు ఎన్నికలు వచ్చాయి. డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు ఎన్నికల్లో పోటీ చేయడంతో కాస్త బ్రేక్ తప్పలేదు. ఎన్నికలు అయిపోయాయి, కన్నబాబు మంత్రి అయ్యారు, ఇక సినిమా మీదకు వెళ్లిపోవచ్చు అనుకుంటే కళ్యాణ్ కృష్ణ సోదరుడు అకాలమరణం చెందారు. 

ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ఈలోగా నాగ్ కు మన్మధుడు 2 రూపంలో షాక్ తగిలింది. ఇంతలో అనుకోకుండా నాగ్ చైతన్యకు శేఖర్ కమ్ముల సినిమా వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చింది. ఇలా ఒకటి ఒకటి అడ్డం పడుతుండడంతో ఈ ప్రాజెక్టు మీద గ్యాసిప్ లు పుట్టుకొస్తున్నాయి.

చైతన్య చేయడం లేదని, వేరెవరినో చూడాలని, లేదా స్క్రిప్ట్ మారుస్తారని ఇలా రకరకాలుగా. కానీ వాస్తవం ఏమిటంటే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ చేసారని బోగట్టా. రెండు సీన్లు మినహా మిగిలిన స్క్రిప్ట్ ఓకె అయిందని తెలుస్తోంది.

ఆ రెండు సీన్ల బెటర్ మెంట్ అయిపోతే డైరక్టర్ సైడ్ నుంచి అంతా ఓకె. ఇక నాగ్ డేట్ లు ఇవ్వడం, చైతన్య డేట్ లు ఎప్పటికి వీలవుతుందో చూసుకోవడం బట్టి సినిమా వుంటుందని తెలుస్తోంది.