దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ మాట అంటూ వుంటారని టాక్. ' నా సినిమాలో పాటలు పల్లెల్లో పెళ్లి పందిట్లో నాదస్వరం వాయించేవారు కూడా సులువుగా వాడుకోగలగాలి' అన్నది ఆ మాట. కొత్తగా ట్రయ్ చేసామా? మరోటా? అన్నది కాదు, పాపులర్ అయ్యాయా లేదా? అన్నదే కీలకం.
ఆయన చాలా కాలం తరువాత తన దర్శకత్వ సూపర్ విజన్ లో పెళ్లిసందD అనే సినిమా అందిస్తున్నారు. పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేదు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో. కన్నడ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్. ఇప్పటి వరకు పెద్దగా హడావుడి చేసిందీ లేదు.
కానీ విషయం ఏమిటంటే ఈ సినిమా నుంచి వదులుతున్న పాటలు అన్నీ చాలా సైలంట్ గా హిట్ అయిపోతున్నాయి. ఆరు నెలల కిందట విడుదల చేసిన 'ప్రేమంటే ఏంటీ' అనే పాట 25 మిలియన్లు దాటేసింది యూట్యూబ్ లో. ఆ తరువాత 'బుజ్జులు..బుజ్జులు' అనే పాట విడుదల చేస్తే పది మిలియన్లు దాటేసింది. వారం రోజుల క్రితం మధురానగరిలో అనే పాట వదిలితే రెండు మిలియన్లు దాటేసింది.
పాటలన్నీ కీరవాణి కాంబినేషన్ లో చంద్రబోస్ రాసారు. నిజానికి పెద్ద సినిమాలు అయితే వ్యూస్ రావడం సహజం. చిన్న సినిమాల పాటలకు వ్యూస్ రావాలంటే మినిమమ్ క్వాలిటీ వుండాలి. గమ్మత్తేమిటంటే ఇంతలా వ్యూస్ వస్తున్నా సినిమా యూనిట్ మాత్రం ఏ హడావుడి చేయడం లేదు. పెద్దగా పబ్లిసిటీ కూడా చేయడం లేదు. వాటి లెక్కన అవి వెళ్తున్నాయంతే.
ఈ సినిమా దసరాకు విడుదలవుతోంది.