అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ ఎందుకు కీలకమంటే

92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో తొలి సారిగా తెలుగు హీరో జాతీయ అవార్డు గెలిచాడు. అతను అల్లు అర్జున్. వినడానికే ఇది “ఔనా?” అనిపించేలా లేదు?! Advertisement ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, చిరంజీవి..ఇలా ఎవ్వరికీ…

92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో తొలి సారిగా తెలుగు హీరో జాతీయ అవార్డు గెలిచాడు. అతను అల్లు అర్జున్. వినడానికే ఇది “ఔనా?” అనిపించేలా లేదు?!

ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, చిరంజీవి..ఇలా ఎవ్వరికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదా? 

నిజంగానే రాలేదు! 

అల్లు అర్జున్ తో తెలుగు సినీ పరిశ్రమ జతీయ ఉత్తమనటుడు అవార్డు బోణీ కొట్టిందన్నమాట. 

గతంలో ఎవ్వరికీ ఎందుకు రాలేదో చర్చ అనవసరం. కారణాలు అనేకముంటాయి రాకపోవడానికి. ఇన్నేళ్లకైనా వచ్చినందుకు మనం కచ్చితంగా ఆనందించాలి, అల్లు అర్జున్ ని అభినందించాలి. 

హీరోగా అల్లు అర్జున్ ప్రస్థానం చాలా స్ఫూర్తిదాయకం.

ఫిజిక్ ని ఏ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లేకుండా మెయింటేన్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. అది చేసి చూపిస్తున్నాడు. 

ఒక తరానికి చిరంజీవి డ్యాన్సుల్లో డెమీగాడ్ అయితే ఆయనని మరిపిస్తూ మరో తరానికి డ్యాన్సింగ్ కింగ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి! ఆ కష్టం పడ్డాడు. ఎప్పటికప్పుడు డ్యాన్సుల్లో తన మార్క్ చాటుకుంటున్నాడు. తన గ్రేస్ ప్రదర్శిస్తున్నాడు. 

ఇవన్నీ ఒకెత్తైతే పర్ఫామెన్స్ లో పూర్తి స్థాయి ఎనెర్జీ చూపించే అతి తక్కువ నటుల్లో అల్లు అర్జున్ అగ్రగణ్యుడు. కథ, కథనాలు ఎలా ఉన్నా కేవలం తన ప్రెజెన్స్ తో చివరి వరకు కూర్చోపెట్టగలడు. 

అలాగే ప్రయోగాల విషయానికొస్తే మెథడ్ యాక్టింగ్ ఎలా చేయొచ్చో చేసి మెప్పించాడు “పుష్ప”తో. లుక్, వాక్, టాక్ ఇలా అన్ని విషయాల్లోనూ మునుపెన్నడూ చూపించని ప్రత్యేకతని చూపించాడు. భుజాన్నెత్తి నడిచే నడకైనా, “పుష్ప అంటే ఫ్లవరనుకున్నావా ఫైరు” అని చెప్పినా, శ్రీవల్లి పాటలో చెప్పు వదిలేసే స్టెప్పు వేసినా అన్నీ అల్లు అర్జున్ కే చెల్లు అన్నట్టుగా చేసాడు. 

“పుష్ప” జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. తెర వెనుక సుకుమార్ మేథాశక్తి ఎంతున్నా తెర మీద ఆద్యంతం అలరిస్తూ నడిపించాల్సిన నటుడు బన్నీయేగా! తెలుగు వాళ్లకంటే అతను ఐకాన్ స్టార్ కాబట్టి ఏం చేసినా చూసేస్తారులే అనుకుంటే మరి ఇతర భాషల్లో! అక్కడ కూడా దుమ్ము దులిపింది కదా  ఈ చిత్రం. 

అల్రెడీ మళయాళంలో తనకంటూ స్టార్డం ని ఎప్పుడో సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. 

చెన్నైలో చదవడం కారణంగా తమిళంలో అద్భుతంగా వేదికలమీద ప్రసంగించగలడు. 

హిందీ ఆడియన్స్ కి డబ్బింగ్ సినిమాలతో సుపరిచితుడై, “పుష్ప”తో స్టారైపోయాడు. 

ఆరకంగా అల్లు అర్జున్ ఆల్రెడీ జాతీయ నటుడే. 

అన్ని విధాలుగా “పుష్ప” జాతీయ అవార్డు పొందే అర్హత అల్లు అర్జున్ కి ఉందని ముందే పలువురు భావించారు. 

అయితే పాత్ర పరంగా పుష్ప ఒక స్మగ్లర్. అటువంటి పాత్రకి జాతీయ అవార్డు రావడం జరగదని చాలామంది అనుమానించారు. ఒక స్మగ్లర్ పాత్రకి పొరపాటునైనా అవార్డిస్తే అది నేషనల్ అవార్డుకే అప్రతిష్ట అని కూడా కొందరు చెప్పారు. అయినప్పటికీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ అవార్డు ప్రకటన జరిగిపోయింది. 

అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావడం చాలా కీలకం. ఎందుకంటే ఒక పక్కన ఆర్.ఆర్.ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ బరిలో నిలబడడం వల్ల రాం చరణ్, జూ ఎన్.టి.ఆర్ పేర్లు దేశమంతా మారుమోగాయి. వాళ్ల స్టార్డం పైస్థాయికి వెళ్లింది. 

పైగా “గ్లోబల్ స్టార్” అంటూ రాం చరణ్ కి ఫ్యాన్స్ పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో టాప్ స్లాట్ లో కుర్చోవడానికి అన్ని అర్హతలు ఉన్న అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కీలకమే కదా! అది కూడా కేవలం ఉత్తమ నటుడు అవార్డు కాదు.  తెలుగు సినీ చరిత్రలోనే జాతీయ స్థాయిలో తొలి ఉత్తమ నటుడు అవార్డు. ఇది కదా చరిత సృష్టించడమంటే. తర్వాత ఎంతమందికైనా ఈ అవార్డు రావొచ్చు. కానీ ఎపటికీ వాళ్లు “తొలి ఉత్తమ నటులు” కాలేరు!! అదీ ఇక్కడ విశేషం. 

ఎలా చూసుకున్నా ఈ 2023 తెలుగు సినిమాకి స్వర్ణమయం అని చెప్పాలి. జాతీయంగా, అంతర్జాతీయంగా పలు అవార్డులు, గుర్తింపులతో టాలీవుడ్ దూసుకుపోయింది. 

ఇది ఇలాగే కొనసాగాలని..హీరోల మధ్యన ఆరోగ్యకరమైన పోటీతో మరిన్ని అవార్డులు, రివార్డులు, రికార్డులు తెలుగు సినిమాకి సొంతం కావాలని సినీ అభిమానులుగా కోరుకుందాం. 

శ్రీనివాసమూర్తి