ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి గురించి తెలిసి కూడా, ఆయన్ను గెలుక్కోవడం అంటే సాహసమనే చెప్పాలి. పవన్‌కల్యాణ్ అభిమానులు చేసిన తప్పిదానికి పవర్‌స్టార్ బలి అయ్యారు.
తమ ఆరాధ్య నేతపై పోసాని విమర్శలు సంధించారనే ఆవేదనతో పవన్‌కల్యాణ్ అభిమానులు అసభ్య మెసేజ్‌లు పెట్టి తమకకు తాముగా పోసాని చేతిలో ఊచ కోతకు గురయ్యేలా చేశారు.
పోసాని-పవన్ కల్యాణ్ ఎపిసోడ్ చూసి కూడాటీడీపీ గెలుక్కోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. లోకేశ్ లేదా చంద్రబాబునో తిట్టించాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారని అర్థం చేసుకోవాలి. పవన్‌కల్యాణ్‌పై దూషణలకు దిగిన మూడు రోజుల తర్వాత టీడీపీ ఎస్సీ సెల్‌కు జనసేనానిపై సానుభూతి వచ్చింది.
ఏపీ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి తీవ్ర దూషణల వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు. పోసాని తన నవరసాలను తాడేపల్లి ప్యాలెస్‌లో చూపించుకోవాలని హితవు చెప్పారు.
సీఎం జగన్ తరుఫున వకాల్తా పుచ్చుకోవటానికి పోసాని సిగ్గు పడాలన్నారు. ఆడవాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడిన పోసానిపై ఎందుకు చర్యలు తీసుకోరని రాజు ప్రశ్నించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పోసాని కృష్ణ మురళికి లేదని రాజు పేర్కొన్నారు.
గతంలో ఇదే టీడీపీ యువనేత లోకేశ్ తనపై అసభ్యంగా ప్రచారం చేస్తున్నారని పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలను టీడీపీ నేతలు మరిచిపోయినట్టున్నారు. జగన్‌పై పవన్ విమర్శల వెనుక తామున్నామని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వుంది.
సమసిపోయిన విషయాన్ని గుర్తు చేయడం అంటే ఇది కొనసాగాలని టీడీపీ ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పోసానిని గెలికితే, చివరికి తమ అధినేతలకు చిక్కులు తప్పవని కిందిస్థాయి నాయకులు గుర్తించుకోవడం మంచిది.