ఒకరు కాదు, ఇద్దరు కాదు, బోలెడు మంది మెగాక్యాంప్ హీరోలు వున్నారు. కానీ అందరిదీ మౌన వ్రతమే. ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అటు మెగా హీరోలు, మెగా క్యాంప్, ఇటు జన సైనికుల నుంచి, ఇలా అన్ని వైపుల నుంచి వ్యూహత్మక మౌనమే సమాధానంగా వుంది.
ఆఖరికి ఈ రోజు ట్రయిలర్ వచ్చింది. తాను తీస్తున్నది పవన కళ్యాణ్ మీద కాదు అని నిర్మొహమాటంగా ఆర్జీవీ అబద్దం ఆడేస్తున్నప్పటికీ ఎవరి మీద సినిమా తీస్తున్నారో తెలియనంత అమాయకులు కాదు జనం. టాలీవుడ్ లో సమస్య వస్తే అంతా వుయ్ ఆర్ విత్ యు అంటూ మద్దతు పలుకుతారు. మరి పవన్ కళ్యాణ్ కు ఎవ్వరూ ఎందుకు మద్దతు పలకడం లేదో అన్నది తెలియదు.
మెగాక్యాంప్ అంటే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వుండొచ్చు. కానీ మిగిలిన వారికి ఏమయింది? ఇది తప్పు అని ఎందుకు ఆర్జీవీని ఖండించడం లేదు? నిఖిల్ లాంటి హీరో మాత్రం ధైర్యం చేసి పవన్ కు కొండతో, వర్మను కుక్కతో పోలుస్తూ ట్వీట్ వేసారు. ఆ పాటి చొరవ, ధైర్యం ఏ ఇతర హీరో కానీ, ఇండస్ట్రీ సెలబ్రిటీ కానీ చేయలేకపోయారు. ఇదే కనుక పవన్ కళ్యాణ్ మీదో, మరే ఇండస్ట్రీ ఫిగర్ మీదో, ఇంకెవరైనా ఏదైనా రాసినా, తీసినా, చేసినా, విరుచుపడిపోయేవారు. ఆర్జీవీ కదా? ఎక్కడి వారు అక్కడ గప్ చుప్.