ముఖ్యమంత్రి జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. ఆ కొంతమందిలో కూడా వాస్తవానికి జగన్ పై ఎలాంటి ద్వేషం లేదు, కేవలం రాజకీయ విద్వేషం తప్ప. ప్రతిపక్ష పార్టీల రాజకీయ కుట్రలో భాగంగానే అమాయకులను జగన్ పైకి ఎగదోస్తున్నారు. అమరావతి దళిత ఐకాస ఆధ్వర్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.
విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుని వీరు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉందో లేదో తెలియని అమరావతిలో దళిత ఆశాజ్యోతి విగ్రహం కావాలట. అసలా డిమాండ్ లోనే డొల్లతనం ఉంది.
విజయవాడ పీడబ్యూడీ గ్రౌండ్స్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుని రాష్ట్రమంతా స్వాగతించింది. దళితులు తమ ఆరాధ్య దైవం నిలువెత్తు విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అదే జరిగితే చంద్రబాబుకి ఆ విగ్రహం చూసినప్పుడల్లా తల కొట్టేసినట్టవుతుంది. అమరావతి పేరు చెప్పి ఐదేళ్లు నాటకం ఆడిన బాబుని కాదని, ఏడాది లోగా విజయవాడలో శంకుస్థాపన చేశారు జగన్. మరో ఏడాది తిరిగేలోగా విగ్రహం ప్రారంభమైతే బాబు పరువేం కాను.
అందుకే తమ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరిని రెచ్చగొట్టి జగన్ పై ఆరోపణలు చేయిస్తున్నారు బాబు. ఇడుపులపాయ నుంచి విజయవాడలో విగ్రహ స్థాపనకు ఆన్ లైన్లో శంకుస్థాపన చేయడం వారికి నచ్చలేదట. అందుకే జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలట. ఇంత వితండవాదం ఎక్కడా మనం వినలేదు.
కనీసం విమర్శ చేయడానికైనా సరైన పాయింట్ ఉండాలి కదా. ఆన్ లైన్లో శంకుస్థాపన చేసినంత మాత్రాన అట్రాసిటీ కేసు పెట్టాలనడం, దాన్ని రాజధానికి లింక్ పెట్టి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. ఇకనైనా దళిత, బలహీన వర్గాలు నిజమైన అభివృద్ధిని, తమ ఉన్నతికి పాటుపడిన వ్యక్తిని గుర్తించాలి. ప్రతిపక్షాల మాయ నుంచి బైటపడాలి.
ఏపీ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఎస్టీ మహిళను మంత్రిని చేశారు. అప్పటి అధికార పార్టీ చిత్ర హింసలు పెట్టినా తప్పుడు కేసుని ఒప్పుకోకుండా జగన్ కోసం నిలబడ్డ ఓ సాధారణ ఎస్సీ ఫొటోగ్రాఫర్ ని పార్లమెంట్ కి పంపించారు. పోలీస్ స్టేషన్లో ఎస్సీపై దాడి జరిగిందనే సమాచారంతో.. నిజనిర్థారణ జరక్కముందే ఎస్సైని సస్పెండ్ చేయించి.. డీజీపీని ఆ కేసుపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. జగన్ చేస్తున్న ఈ పనులు చూసైనా “ఆ కొంతమంది” దళితులు మారాలి.