తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆయన చేరిపోవడం ఖాయమనే ఊహాగానాలు చాన్నాళ్ల నుంచినే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అధికారికంగా ఆ పార్టీలోకి చేరకుండా, అదే సమయంలో అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చిన వారే ఈ జగ్గారెడ్డి. చాలాకాలంగా కాంగ్రెస్ లోనే కుదురుగా ఉంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా నెగ్గారు.
ఈ క్రమంలో నెగ్గిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరిపోయే రాజకీయమే తెలంగాణలో నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జగ్గారెడ్డి కూడా ఆ పనే చేస్తారని ఊహాగానాలున్నాయి. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా చాలాసార్లే మాట్లాడారు ఈ ఎమ్మెల్యే. అయితే ఆ పార్టీలోకి మాత్రం ఇంకా చేరలేదు. ఈయన చేరడం ఖాయమనే పుకార్లు మాత్రం ఉన్నాయి. వాటికి మరింత ఊతం ఇస్తూ.. జగ్గారెడ్డి తాజాగా హరీష్ రావుకు సన్మానం కూడా చేశారు.
గతంలో చాలాసార్లు హరీష్ రావును ఇష్టానుసారం విమర్శించారు జగ్గారెడ్డి. హరీష్ రావు కూడా జగ్గారెడ్డిని చాలా రకాలుగా విమర్శించారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు హరీష్ రావుకు జగ్గారెడ్డి ప్రత్యేకంగా సన్మానం చేయడం విశేషం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ఇంకా ఫిరాయించకుండానే.. ఇలా మంత్రివర్యులకు సన్మానం చేయడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.