కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక వేడి మొదలైంది. ఇవాళ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ, అలాగే బద్వేలు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇక జనసేన-బీజేపీ కూటమి, కాంగ్రెస్ తమ అభ్యర్థుల వెతుకులాటలో ఉన్నాయి.
జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకుంది. బద్వేలు ఉప ఎన్నిక విషయమై ఆ రెండు పార్టీలు దృష్టి సారించాయి. జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఉప ఎన్నికలో కలిసి పోటీ చేయడం వల్ల… జనసేన-బీజేపీ మిత్రపక్షంగా ఉన్నాయనే సంకేతాలను పంపడానికి బీజేపీ ఉత్సాహం చూపుతోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికంత సీరియస్‌గా తీసుకోవడం లేదు.
తిరుపతిలో గెలిచినా, ఓడినా అందరి దృష్టి ఆకర్షించేది కావడంతో తానే పోటీ చేయాలని బీజేపీ పట్టుబట్టి అనుకున్నది సాధించింది. కానీ బద్వేలు ఉప ఎన్నిక అలాంటిది కాదు. దీంతో బద్వేలుపై బీజేపీ అనాసక్తిగా ఉన్నట్టు తెలిసింది. జనసేనకే టికెట్ కేటాయించి ఆ పార్టీకి ఎలాంటి బలం లేదని నిరూపించేందుకే బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బద్వేలులో వివిధ పార్టీల బలాబలాలేంటో చూద్దాం.
ఇక్కడ డాక్టర్ వెంకటసుబ్బయ్య వైసీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ రెండోస్థానంలో నిలిచారు. జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీకి టికెట్ కేటాయించింది.
బీఎస్పీ అభ్యర్థి ఎన్. ప్రసాద్‌కు 1321 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ సొంతంగా పోటీ చేసి 735 ఓట్లు దక్కించుకుంది. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే జయరాములు పోటీ చేయడం గమనార్హం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే జనసేన బలపరిచిన బీఎస్పీ , సొంతంగా పోటీ చేసిన బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి.
నోటాకు వచ్చిన ఓట్లు 2004. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎన్డీ విజయజ్యోతికి 2,883 ఓట్లు రావడం విశేషం. ఈమె మూడోస్థానంలో నిలిచారు. ఈ గణాంకాలను బట్టి బీజేపీ, జనసేన బలాలేంటో అంచనా వేసుకోవచ్చు. అందుకే జనసేనను ముందుకు తోసి, తాను వెనక నుంచి మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.