ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టడం కాకుండా ఇప్పుడు దేశానికి అనేక నగరాలు అవసరం. ఎక్కువ సంఖ్యలో పట్టణ కేంద్రాలు ఉంటే బాగుంటుంది. కాబట్టి… రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. హైకోర్టు తన పరిధి దాటింది. హైకోర్టు ఎగ్జిక్యూటివ్ కారాదు! రాజధాని ఏర్పాటు, పట్టణంగా తీర్చిదిద్దడం వేర్వేరు అంశాలు. ఇప్పుడు హైకోర్టు టౌన్ ప్లానర్‌గా, చీఫ్ ఇంజనీర్‌గా మారడం సబబేనా? కోర్టులకు ఈ విషయాల్లో నైపుణ్యం లేదు. అయినా… రెండు నెలల్లో అది చేయండి… ఇది చేయండి అంటే ఎలా? రెండు నెలల్లో డ్రాయింగ్ కూడా చేయలేరు. మొత్తం పట్టణాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు అంటోంది. ఎగ్జిక్యూటివ్ అధికారాలను హైకోర్టు ఊహించుకొని ఇలా ఉత్తర్వులు జారీ చేయవచ్చా? – జస్టిస్ నాగరత్న
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి దాదాపు రూ.15వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం 29వేల మంది రైతులు రెండెకరాలలోపు భూమిని రాజధాని కోసం ఇచ్చారు. రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామన్నది ప్రభుత్వ హామీ. అమరావతిలో చాలా పెట్టుబడులు పెట్టారు! సీఆర్డీయేలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. భూములిచ్చిన రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిపై నిధులు వెచ్చించారు. ప్రజాధనం, ప్రజా విశ్వాసం, రాజ్యాంగం, నైతికత వంటి వాటిని కలిసికట్టుగా పరిశీలిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్లడాన్ని అనుమతించకూడదు! – జస్టిస్ జోసఫ్
ఈ రెండు పేరాలు నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యానాలు అంటూ తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా అందించినవే. అందువల్ల ఇలా అన్నారా? లేదా? అనే సందేహం పెద్దగా అవసరం లేదు.
అనుభవం పండించుకుని, అత్యున్నత స్ధానానికి ఎదిగిన న్యాయ కోవిదులు పద్దతిగా ఆలోచించి కామెంట్ చేస్తే వ్యాఖ్యానాలు ఇలా పూర్తి నిబద్దతతో వుంటాయని అర్థం అవుతోంది. ఇద్దరు న్యాయమూర్తులు చెప్పిన విషయాలు కచ్చితంగా నూటికి నూరుపాళ్లు నిజమే.
చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం 29వేల మంది రైతులు రెండెకరాలలోపు భూమిని రాజధాని కోసం ఇచ్చారు. రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామన్నది ప్రభుత్వ హామీ..దీని నుంచి వెనక్కు వెళ్లలేరు. ప్రభుత్వాలు మారినా ఒప్పందాలు మారకూడదు. అందువల్ల జగన్ ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు ముందే క్లారిటీ ఇచ్చి వుండాల్సింది. అలాగే పనులు మొదలుపెట్టి వుండాల్సింది. రాజధానికి భూములు ఇచ్చారా? ప్రభుత్వానికి భూములు ఇచ్చారా? అన్న వాదనను పక్కన పెడితే, ఇచ్చిన భూములు అభివృద్ది చేసి, ఎవరికి ఇవ్వాల్సిన వాటా వారికి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఎప్పటికీ వుంటుంది. దాన్ని విస్మరించే చాన్సే లేదు. దాని నుంచి పక్కకు వెళ్లే అవకాశమే లేదు. ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా దాన్నే బలపరుస్తున్నాయి.
ఇదే సమయంలో మరో న్యాయమూర్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా అద్భుతంగా వున్నాయి. వికేంద్రీకరణ, ప్రభుత్వ అధికారాల గురించి ప్రస్తావిస్తూనే, అలవికాని విధమైన, ప్రాక్టికాలిటీకి దూరమైన ఆదేశాలను ఇవ్వడాన్ని ఎత్తి చూపించారు సదరు న్యాయమూర్తి. కామన్ మాన్ మదిలో వున్న అభిప్రాయం ఇదే. అయిదేళ్లలో కాని రాజధాని నిర్మాణం ఆరు నెలల్లో చేయమని శాసించడం సబబేనా? అసలు కార్యనిర్వహణ వ్యవస్థ ఇలా..ఈ విధంగా ప్లాన్ చేయాలని హైకోర్టు ఏవిధంగా చెబుతుంది అన్నది ప్రజల మదిలో వుంది. కానీ కోర్టుల మీద, కోర్టు తీర్పుల మీద వ్యాఖ్యానం చేసే ధైర్యం, అవకాశం రెండూ సామాన్య ప్రజానీకానికి లేవు. అలా అంత మాత్రం చేత ప్రజల్లో కోర్టు తీర్పుల మీద, కోర్టుల వ్యవహార శైలి మీద నిర్దిష్ట అభిప్రాయాలు లేవి అని అనుకోవడానికి లేదు. వాటిని పరిగణనలోకి తీసుకోము..వాటి గురించి ఆలోచించము..అని ఎవరైనా, ఏ రంగమైనా అనుకుంటే అది వేరే సంగతి.
ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యానాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం..అటు రైతులు క్లారిటీగా తీసుకోవాలి. తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ స్థలాలను వీలయినంత త్వరగా అభివృద్ది చేసి, సకల సదుపాయాలు కలిగించి, తమ వాటా తమకు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరవచ్చు..కోరాలి కూడా. దీనిని ప్రభుత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. పార్టీ ఏదైనా ప్రభుత్వం అనేది ఒకటే. గత ప్రభుత్వం..ఈ ప్రభుత్వం అనేది వుండదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనేదే వుంటుంది. అందువల్ల ఒకసారి కమిట్ అయిన తరువాత దాన్ని అమలు పర్చడం అన్నది నైతిక బాధ్యత మాత్రమే కాదు. అధికారిక బాధ్యత కూడా.
రైతులు కూడా రాజధాని మాకే కావాలి..తమకే కావాలి..తమ దగ్గరే వుండాలి అని పట్టుపట్టడం సరి కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు..మిగిలిన ప్రాంతాల ప్రజలకు కూడా ఇలాగే కోరే హక్కు వుంటుంది. కేవలం అమరావతి రైతులే రైతులు కాదు. వారికే నోరు వుండదు..అందరికీ వుంటుంది. తాము రాజధానికే స్థలం ఇచ్చాము వేరే విధంగా అయితే అంగీకరించం అనే భావన వుంటే ప్రభుత్వంతో ఒప్పందం రద్దు చేసుకుని, తమ భూములు వెనక్కు తీసుకునే మార్గాలను అన్వేషించాలి. అంతే కానీ రాజధాని విషయంలో ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించడం అన్నది సరికాదు. అలా ప్రశ్నిస్తే గత పభుత్వం మాత్రం ఏ అధికారంతో రాజధానిని నిర్ణయించింది అని మిగిలిన ప్రాంతాల వారు నిలదీసే అవకాశం, అధికారం ఎప్పుడూ వుంటుంది. ఈ ప్రభుత్వానికి లేని అధికారాలు గత ప్రభుత్వానికి మాత్రం ఎలా వుంటాయి?
తీర్పుల మీద కామెంట్ చేయకూడదు. కానీ వాటిలోని మంచిని, పూర్వా పరాలను, తీసుకోవాల్సిన సలహాలను తీసుకోవడం అన్నది కోర్టుకు ఎక్కిన ఇరుపక్షాల బాధ్యత. ఈ బాధ్యతను పక్కన పెట్టి పోరుబాటలోనే ఇరు పక్షాలు ముందుకు సాగుతాం అనుకుంటే ఎవ్వరూ చేసేది ఏమీ లేదు. ఎప్పుడు తెగుతుందా అని ఎదురు చూడడం తప్ప.