వైసీపీ ఖుషీ!

రాజ‌ధాని అమ‌రావ‌తిపై విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు ఇవాళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సుప్రీం ఘాటు వ్యాఖ్య‌ల‌ను ఎలా అభివ‌ర్ణించాలో తెలియ‌క ఎల్లో మీడియా…. త‌న మార్క్ వార్త‌ల‌ను వండివారుస్తోంది. ఇది కూడా…

రాజ‌ధాని అమ‌రావ‌తిపై విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు ఇవాళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సుప్రీం ఘాటు వ్యాఖ్య‌ల‌ను ఎలా అభివ‌ర్ణించాలో తెలియ‌క ఎల్లో మీడియా…. త‌న మార్క్ వార్త‌ల‌ను వండివారుస్తోంది. ఇది కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ అని చెప్ప‌డం వారికే చెల్లింది. కానీ అధికార పార్టీలో సుప్రీం కామెంట్స్ జోష్ నింపాయ‌ని చెప్పొచ్చు. సుప్రీం ధ‌ర్మాస‌నం హైకోర్టును త‌ప్పు ప‌డుతూ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

మంత్రులు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మీడియా ముందుకొచ్చి త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒకే ప్రాంతానికి అభివృద్ధి కేంద్రీకృతం కావ‌డం వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం వాటిల్లుతుంద‌న్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింద‌ని ఆయ‌న ప్ర‌స్తావించ‌డం విశేషం.

సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం న్యాయ‌మైంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయ‌న్నారు. జ‌గ‌న్‌ తీసుకున్న నిర్ణయానికి ఏపీలో‌ ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. చట్టం కూడా సీఎం వైఎస్ జగన్‌కు సహకరిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్రబాబు నాయుడు కుట్రలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టిందన్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తిని ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలా చేయ‌డం వ‌ల్లే చివ‌రికి ఆ ప్రాంతంలో కూడా ప్ర‌జ‌లు తిరస్క‌రించార న్నారు. చంద్ర‌బాబు కొడుకే రాజ‌ధాని ప్రాంతంలో పోటీ చేశార‌నే సంగ‌తిని ఆయ‌న గుర్తు చేశారు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం త‌ర్వాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

ఒకే చోట రాజధాని కట్టాలని హైకోర్టు చెప్పడం సరైనది కాదు, దానిపై సుప్రీంకోర్టు తప్పుపట్టి, ప్రశ్నించింద‌ని ఆయ‌న ఆనందంగా చెప్పారు. పవన్ కల్యాణ్, రామోజీ రావు కోరిక చంద్రబాబు సీఎం కావాలనేదే అని ఆయ‌న అన్నారు. పవన్‌కు అధికారంలోకి రావాలని కోరిక లేద‌న్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య‌లు వైసీపీకి కొంత వ‌ర‌కూ ఉప‌శ‌మ‌నం ఇచ్చాయ‌ని… ఆ పార్టీ నాయ‌కుల మాట‌ల ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మూడు రాజ‌ధానుల‌కు సుప్రీంకోర్టు మ‌ద్ద‌తు వుంటుంద‌ని వైసీపీ ఖుషీ అవుతోంది.