“ము..ము..ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా అన్నాడో సినీ కవి.” ముద్దంటే ఎవ్వరికీ చేదుండదు. కానీ అదే పనిగా ముద్దుపెడితే మాత్రం అంతకంటే కష్టం మరోటి ఉండదు. ఓ జంట మాత్రం అదే పనిగా ముద్దుపెట్టుకుంది. ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేసింది. ఇంతకీ వీళ్లు ఎంత సేపు లిప్ కిస్ పెట్టుకున్నారో తెలుసా? అక్షరాలా 58 గంటల 35 నిమిషాల 58 సెకెన్లు.
థాయ్ ల్యాండ్ కు చెందిన ఓ జంట 2013లో లాంగెస్ట్ కిస్ రికార్డ్ నెలకొల్పింది. 2 రోజులకు పైగా ముద్దు పెట్టుకొని వీళ్లు రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు అదే దేశానికి చెందిన ఎకాసి-లక్సానా అనే జంట ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు 58 గంటల 35 నిమిషాల 58 సెకెన్ల పాటు వీళ్లు లిప్ కిస్ పెట్టుకున్నారు.
వాలంటైన్స్ డే సందర్భంగా పట్టాయ నగరంలో ఫిబ్రవరి 12-14 తేదీల మధ్య ఈ రికార్డ్ నమోదైంది. ఓ సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట.. తమతో పాటు పోటీకి దిగిన 9 జంటల్ని వెనక్కినెట్టి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది.
అయితే ఇదేమంత ఆస్వాదించేంత మూతి ముద్దు కాదు. ఈ రికార్డ్ కోసం ఈ జంట తమ పెదవుల్ని అలానే అట్టిపెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఆహారం తీసుకునేటప్పుడు కూడా వీళ్లు పెదవులు వదల్లేదు. స్ట్రా ద్వారా ద్రవ పదార్థాల్ని మాత్రమే తీసుకున్నారు. 2 రోజులు నిద్రపోకుండా అదే పనిగా ముద్దుపెట్టుకున్నారు. అంతేకాదు, బాత్ రూమ్ కు వెళ్లినప్పుడు కూడా వీళ్లు తమ పెదాల్ని వదల్లేదు.
ఇంత కష్టపడ్డారు కాబట్టే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వీళ్ల సొంతమైంది. అంతేకాదు, రెండు డైమండ్ రింగ్స్ కూడా వీళ్లకు బహుమతులుగా దక్కాయి. తాజాగా వీళ్ల రికార్డును ధృవపరుస్తూ గిన్నిస్ బుక్ వాళ్లు వీళ్లకు పత్రాన్ని కూడా అందించారు. ఈ రికార్డు కనీసం మరో పదేళ్ల వరకైనా నిలబడుతుందని చెబుతున్నారు గిన్నిస్ వాళ్లు.