మరోసారి తెరపైకి వైఎస్ షర్మిల

జగన్ వదిలిన బాణంగా తననుతాను అభివర్ణించుకున్న వైఎస్ షర్మిల పేరు మరోసారి రాజకీయ ముఖచిత్రంపైకి వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు కీలక పదవి దక్కుతుందని ఆశించారు చాలామంది. కానీ ఇప్పటివరకు…

జగన్ వదిలిన బాణంగా తననుతాను అభివర్ణించుకున్న వైఎస్ షర్మిల పేరు మరోసారి రాజకీయ ముఖచిత్రంపైకి వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు కీలక పదవి దక్కుతుందని ఆశించారు చాలామంది. కానీ ఇప్పటివరకు జగన్ ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తిగా ప్రజాసంక్షేమం, ఉద్యోగాల కల్పన, అవినీతిని అరికట్టడంపైనే దృష్టిపెట్టారు. పనిలోపనిగా మంత్రివర్గ కూర్పు కూడా పూర్తిచేశారు. ఇప్పుడు చెల్లెలు షర్మిలపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ప్రతిసారి ఎన్నికల్లో తనకు అండగా నిలబడిన షర్మిలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమెను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు, ఇటు రాష్ట్ర వ్యవహారాలతో పాటు అటు పార్టీ వ్యవహారాలు చూడడం తలకుమించిన భారంగా మారుతోంది. అందుకే పార్టీ కార్యకలాపాల్ని షర్మిలకు అప్పగించాలని ఆయన భావిస్తున్నారట.

తనను పార్టీ గుర్తించలేదని షర్మిల ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తంచేయలేదు. అన్న మాటకు కట్టుబడి మాత్రమే పనిచేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. అంతెందుకు, మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా తనపై ఎలాంటి ఊహాగానాలు చెలరేగకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. అన్నకు మాట రాకుండా ఉండేందుకు తనకుతానుగా తెరవెనక ఉండిపోయారు. అయితే షర్మిలకు సముచిత స్థానం కల్పించాలని, ఆమెను పార్టీలోకి అవసరమైతే ప్రభుత్వంలోకి తీసుకోవాలని కోరుతున్న వైసీపీ వర్గం ఎప్పుడూ ఉండనే ఉంది. అలాంటి అభ్యర్థనలన్నింటిపై ఇప్పుడు జగన్ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో షర్మిల తన మార్క్ చూపించారు. బైబై బాబు, బైబై పప్పు అనే నినాదంతో దూసుకుపోయారు. ఆ టైమ్ లో షర్మిల ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనాల్లోకి చొచ్చుకుపోయాయి. కేవలం గత ఎన్నికల్లోనే కాదు, 2014 ఎన్నికల్లో కూడా కీలకంగా పనిచేశారు షర్మిల. అక్రమ కేసులు బనాయించి తన అన్న జగన్ ను జైలుకు పంపించిన సమయంలో పార్టీ కూలిపోకుండా అహర్నిశలు శ్రమించారు. తండ్రి తర్వాత పాదయాత్ర చేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన పాదయాత్రే పార్టీని కాపాడింది.

ఇలా పార్టీ కోసం ఎంత కష్టపడాలో అంతా చేశారు షర్మిల. వైఎస్ఆర్ బిడ్డగా, జగన్ కు చెల్లెలిగా, ప్రజానాయకురాలిగా తన బాధ్యతను నూటికి నూరుశాతం నిర్వర్తించారు. అలాంటి నేతకు పార్టీలో స్థానం కల్పించడంలో తప్పులేదంటారు చాలామంది వైసీపీ నేతలు.

ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శల్ని పట్టించుకోనక్కర్లేదని, రాజకీయాలకు పనికిరాని లోకేష్ లాంటి వ్యక్తినే చంద్రబాబు మంత్రిని చేసినప్పుడు.. తననుతాను నిరూపించుకొని ప్రజానాయకురాలిగా ఎదిగిన షర్మిలకు పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించడంలో ఏమాత్రం తప్పులేదని వాదిస్తున్నారు. అది నిజం కూడా. మరి ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సైరాపై డైరెక్టర్ అంచనాలేంటి..?