జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్ నటనకు మంచి పేరు వచ్చింది. కట్ చేస్తే, ఆయన నటించిన మలయాళ సినిమాలన్నీ కుప్పలుతెప్పలుగా తెలుగుతెరపై పడ్డాయి. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ఇక్కడ హిట్ అయింది. ఇంకేముంది, అతడు నటించిన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతూ వస్తోంది. తెలుగులో ఓ చిన్న గుర్తింపు వస్తేచాలు, ఆ నటుడికి సంబంధించిన సినిమాలన్నీ డబ్బింగ్ రూపంలో టాలీవుడ్ ను ముంచెత్తుతాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి అధర్వ కూడా చేరిపోయాడు.
గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు నటించాడు అధర్వ. అతడు చేసిన పాత్రకు తెలుగు ప్రేక్షకుల్లో అంతోఇంతో గుర్తింపు వచ్చింది. దీంతో అధర్వ నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి క్యూ కడుతున్నాయి. తొలి విడతలో భాగంగా బూమరాంగ్ అనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
ఒకప్పుడు సూర్య, నయనతార, విజయ్ ఆంటోనీ సినిమాల రైట్స్ ను మాత్రమే తీసుకునే చోటామోటా నిర్మాతలు, ఈసారి అధర్వపై కూడా కన్నేశారు. అతడు నటించిన తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకుంటున్నారు. గద్దలకొండ గణేష్ హవా నడుస్తున్న ఈ 2-3 నెలల్లోనే అధర్వ డబ్బింగ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో ఏమాత్రం పేరొచ్చినా వాళ్లు నటించిన సినిమాలన్నీ ఇలా డబ్బింగ్ అయిపోవడం కామన్ అయిపోయింది. ఈగ హిట్ అయినప్పుడు సుదీప్ సినిమాలు ఇలానే వచ్చాయి. ఉపేంద్ర సినిమాలైతే రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ లిస్ట్ లోకి విజయ్ సేతుపతి కూడా చేరబోతున్నాడు. ఇతడు సైరా సినిమాలో కీలకపాత్ర పోషించాడు మరి.