అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ కొందరు వెయ్యి రోజులుగా నినదిస్తుండడం చూస్తున్నాం. మంచి సినిమాను రోజుల తరబడి ప్రదర్శించిన చందంగా…. అమరావతి అనే సినిమా కూడా 100, 200…దాటుకుని ప్రస్తుతం 1000 రోజులకు దిగ్విజయంగా ఎల్లో మీడియా పుణ్యాన ప్రదర్శనకు నోచుకుంది. అమరావతి నుంచి అరసవెల్లి వరకూ చేపట్టిన పాదయాత్ర అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇది తాత్కాలిక విరమణే అని అమరావతి ఉద్యమ సంస్థలు చెబుతున్నప్పటికీ, శాశ్వతమే అనే మాట బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమంపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారికి మద్దతు తెలిపిన నాయకుడిగా ఆయన మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భూసేకరణ లో భూములు తీసుకోవడం, అభివృద్ధి కోసం నిర్మాణాలను కూల్చడం ఎక్కడైనా జరుగుతుందన్నారు. కానీ ఇది ఇప్పటం అభివృద్ధికి వర్తించదన్నారు.
ఇప్పటంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. ఎక్కడైనా పడగొడితే నష్టపరిహారం భారీగా ఇవ్వాల్సి వుంటుందన్నారు. కానీ ఇప్పటంలో అది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల గుండెకు దెబ్బ తగిలిందన్నారు. తమ పార్టీ ఇప్పటం గ్రామ గాయానికి మందు రాస్తుందని చెప్పుకొచ్చారు.
ఇప్పటం గ్రామస్తుల పోరాటం అమరావతి రైతులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ పోయేది కాదన్నారు. పవన్ అన్న ఒక్క మాటతో అమరావతి ఉద్యమం డొల్లతనం బయటపడింది. అమరావతి ఉద్యమంలో నీతి, నిజాయతీ లేవని ఆయన చెప్పకనే చెప్పారు. అన్నిటికి మించి అమరావతిని కాపాడుకోవాలన్న పట్టుదల వారిలో లేవని పవన్ చెప్పినట్టైంది.
పవన్ వ్యాఖ్యలు అమరావతికి గట్టి షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి ఉద్యమకారుల్లో రాజధానిని కాపాడుకోవాలన్న నిబద్ధత, నాయకత్వం లేవని ఆయన మాటలతో తేలిపోయింది.