ఎమ్బీయస్‍: థియేటర్లు బతకాలి

ఆంధ్రప్రభుత్వం ఆన్‌లైన్ సినిమా టిక్కెట్లను తను అమ్ముతానని ప్రకటించిన దగ్గర్నుంచి, తెలుగు సినీపరిశ్రమకు గొప్ప నష్టం వాటిల్లుతుందని బెంగటిల్లడం దేనికో నాకు అర్థం కావటం లేదు. టిక్కెట్టు ఆన్‌లైన్‌లో కొన్నా, థియేటర్ల దగ్గర చొక్కా…

ఆంధ్రప్రభుత్వం ఆన్‌లైన్ సినిమా టిక్కెట్లను తను అమ్ముతానని ప్రకటించిన దగ్గర్నుంచి, తెలుగు సినీపరిశ్రమకు గొప్ప నష్టం వాటిల్లుతుందని బెంగటిల్లడం దేనికో నాకు అర్థం కావటం లేదు. టిక్కెట్టు ఆన్‌లైన్‌లో కొన్నా, థియేటర్ల దగ్గర చొక్కా చింపుకుని కొన్నా, బ్లాకులో కొన్నా సినిమాను ఎలా తయారుచేశారో అలాగే వుంటుంది తప్ప, వీసమెత్తు మెరుగుపడదు, నాణ్యత వుంటే తరగదు. రైల్వే టిక్కెట్టును ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా, తక్కాల్‌లో బుక్ చేసుకున్నా, అప్పటికప్పుడు స్టేషన్‌కి వచ్చి కొనుక్కున్నా రైలు ఒక్కలాగే వెళుతుంది. సినిమా పరిశ్రమ లాభనష్టాలనేవి తయారయ్యే సినిమాల నాణ్యతపై ఆధారపడుతుంది. పెట్టుబడికి తగ్గ రాబడి వస్తుందా రాదా, సప్లయికి తగ్గ డిమాండు వుందా లేదా, వినియోగదారుణ్ని తృప్తి పరచగలుగుతున్నామా లేదా యిలాటి ఫ్యాక్టర్లు ఏ వ్యాపారానికైనా వర్తిస్తాయి.

విడుదలైన అన్ని సినిమాలూ సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటాయి. కానీ థియేటర్లు చూస్తే ఖాళీగా వుంటున్నాయి. నడపలేక మూతపడుతున్నాయి. సినిమాకి బరామీటరు థియేటర్లో సీట్లు నిండడం. సెల్‌ఫోన్లో ఎంతమంది చూశారనేది కాదు. ఆ థియేటర్లను విస్మరించి, వాటి అస్తిత్వానికే ముప్పు తెచ్చేట్లా తయారైంది సినిమా పరిశ్రమ. థియేటర్లను కాపాడుకోవాలి. వాటి మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చేట్లా చూడాలి. అది జరగాలంటే సినిమాలు చాలాకాలం పాటు థియేటర్లలో ఆడాలి. పెట్టిన పెట్టుబడి రాబట్టాలనే ఆతృతతో, విడుదల సమయంలో టిక్కెట్ల ధర పెంచేసి, థియేటర్లను మూడు రోజుల్లోనే ఖాళీ చేయించేయ కూడదు. చిరంజీవి చెప్పినట్లు సినిమా పరిశ్రమ సంక్షోభంలో వుందంటే దాని అర్థం తాము పెట్టే టిక్కెట్టు ధర కిట్టుబాటు కావటం లేదని ప్రేక్షకుడు భావించడం! ప్రభుత్వాన్ని ఆదుకోమంటే అదేం చేస్తుంది? సినిమా బాగున్నా, బాగోలేకపోయినా చూసి తీరాలని ప్రేక్షకులను నిర్బంధిస్తూ జీవోలు యివ్వాలా?

టిక్కెట్టు ధర కిట్టుబాటయేలా సినిమా తీయాలంటే ప్లానింగు బాగుండాలి. నిర్మాతలు అర్థం చేసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. నంబర్ వన్ – వినియోగదారుడికి సినిమా నిత్యావసర వస్తువు కాదు. పైగా వినోదానికి అతని వద్ద అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. వాటన్నిటినీ దాటుకుని, అతన్ని సినిమా థియేటరు వద్దకు రప్పించడానికి సినీనిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రప్పించాక అతను ‘నేను పెట్టిన ఖర్చుకి కిట్టుబాటైంది’ అని అనుకునేలా తెర మీద భారీతనం కనబరచాలి. అప్పుడే అతను మళ్లీ యింకో సినిమాకి వస్తాడు. మీరు అతన్ని నిరుత్సాహపరిస్తే తెనాలి రామలింగడి పిల్లిలా మళ్లీ యింకో సినిమాకై థియేటరుకి రాడు. టీవీలో లేదా ఓటిటిలో చూడవచ్చులే అని ఊరుకుంటాడు.

కొంతమంది మాత్రమే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కై, నటీనటుల మీద అభిమానం కొద్దీ థియేటర్‌కు వస్తున్నారు. వాళ్లను మీరు ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తున్నారు. నాసిరకం సినిమా తీసి, అతిశయోక్తులతో వాళ్లను మోసగించి డబ్బు గుంజేస్తున్నారు. వారం రోజులు పోతే సినిమా గురించిన అసలైన టాక్ బయటకు వచ్చేస్తుందని భయపడి ఆ లోపే హెచ్చు రేట్లకు టిక్కెట్లమ్మేసి, సగానికి సగం పెట్టుబడి గుంజేసుకుందామని చూస్తున్నారు. హెచ్చు రేట్లకు అమ్మనీయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వాలు ఒప్పుకోకుండా, పొరుగు రాష్ట్రాల మాదిరిగా సముచితమైన ధరను మాగ్జిమమ్ రేటుగా పెడతామని అంటే దాని కారణంగానే సినీ పరిశ్రమ నాశనమై పోతోందని గగ్గోలు పెడుతున్నారు. ఏ వస్తువునైనా ఎమ్మార్పీ కంటె ఎక్కువ రేటు కంటె ఎక్కువకి అమ్మితే ప్రభుత్వం దండిస్తుంది. కానీ మీరు మాత్రం ‘మేం అమ్ముతాం, మీరూరుకోండి’ అని ప్రభుత్వాలని అడుగుతున్నారు. కోర్టుల దగ్గర్నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు.

పోనీ హెచ్చు రేటుకి కొన్నవాడికి మీరేమైనా బెనిఫిట్ యిస్తున్నారా? మేం తీసే తదుపరి సినిమా టిక్కెట్టు సగానికే అమ్ముతామని ఆఫర్ చేస్తున్నారా? నువ్వు మోజు పడుతున్నావు కాబట్టి జరిమానా వేస్తున్నామన్న పద్ధతిలో వసూలు చేస్తున్నారు. తొలివారాల్లో హెచ్చు రేట్లకు టిక్కెట్లు అమ్ముకోవాలని అడగడంలో లాజిక్ ఏమిటి? పెట్టుబడిని త్వరితంగా రాబట్టేయాలనే తాపత్రయమా? ఏ వ్యాపారానికైనా బ్రేక్ ఈవెన్ కావడానికి టైము పడుతుంది. మామూలు రేట్లకు అమ్మినా మీకూ నాలుగు వారాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కానీ మీరు అంత మాత్రం ఆగలేరు. ఎందుకంటే నాలుగు వారాల్లో సినిమా అసలు రంగు బయటపడి ప్రేక్షకులు పెదవి విరిచేస్తారన్న భయం మీకు.

ఆధునిక సాంకేతికత కారణంగా సినిమా పైరసీకి గురవుతుందన్న భయం మాకు అనకండి. ఆ హేకింగ్, ఆ పైరసీ భయాలు బ్యాంకింగ్‌తో సహా అన్ని రంగాలకూ వున్నాయి. ఆ పేరు చెప్పి వాళ్లు చార్జీలు పెంచేయటం లేదు. పైరసీ జరగకుండా చూసుకోవలసినది మీరు. ఎంతసేపూ హీరోహీరోయిన్లకు కోట్లు గుమ్మరించి, సాంకేతిక సిబ్బందికి ఒప్పుకున్న జీతాలివ్వకపోతే వాళ్లకు కడుపుమండి యిలాటివి చేస్తున్నారేమో చూసుకోండి. మీ చేష్టల జరిమానాను సినీఅభిమానులపై విధించకండి. నిజానికి సినీ పరిశ్రమ నిరంతరం వృద్ధి చెందుతూనే వచ్చింది. శతాబ్ది కాలంలో సినిమా పరిశ్రమ టర్నోవరును రికార్డు చేస్తే వేరే ఏ పరిశ్రమా యీ స్థాయిలో పెరగలేదని గమనించవచ్చు. దీనిపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి వున్నాయి. ప్రత్యక్షంగా అయితే 24 కళలకు సంబంధించిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారికి తర్ఫీదు యిచ్చే సంస్థలు, వారి సేవలు నిర్వహించే సంస్థలు, స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, కేటరింగ్ సర్వీసెస్.. యిలా చెప్పుకుంటూ పోతే అంతే వుండదు. పరోక్షంగా అయితే థియేటర్లు, పబ్లిసిటీ ఆర్టిస్టులు, వార్తలందించే, రివ్యూలు రాసే జర్నలిస్టులు.. యిలా రాస్తే కొల్లేటి చాంతాడంత జాబితా తయారవుతుంది.

మనిషి మరణించేవరకు వినోదాన్ని కోరుకుంటాడు. అనేకతరాల పాటు అతన్ని వినోదపరిచే పని అనేక కళారూపాలు చేస్తూ వచ్చాయి. తోలుబొమ్మలాటలతో మొదలుపెడితే, యక్షగానాలు, నాటకాలు యిలా ఎన్నో విధాలుగా అవి ప్రజలను రంజింప చేస్తూ వచ్చాయి. అయితే సినిమా అంటూ వచ్చాక, దాని ప్రదర్శనలోని సౌలభ్యం వలన వీటన్నిటినీ మించి అది పాప్యులర్ అయింది. ఒక నాటకం ప్రదర్శించాలంటే దానిలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఆ ప్రదేశానికి వెళ్లాలి. ఆ రోజు ప్రధాన కళాకారుడు మూడ్‌లో లేకపోయినా, మత్తులో వున్నా ప్రదర్శన రసాభాస అవుతుంది. సినిమాకైతే ఆ బాధ లేదు. ఒక్కసారి చక్కగా నటిస్తే చాలు, ఆ రీళ్లు పట్టుకెళ్లి ఏ మారుమూల ప్రాంతంలోనైనా ప్రదర్శించవచ్చు. పైగా వేదికపై ఏమేరకు చూపించగలరో సంఘటన స్థలాన్ని ఆ మేరకే పరిమితం చేయాలి. కానీ సినిమా ద్వారా మంచుకొండలు, మండే ఎడారులు అన్నీ చూపించవచ్చు.

నాటకంలో సన్నివేశాన్ని ఒకే కోణంలో చూడగలం. సినిమాలో అయితే అనేక కోణాల్లో చూపించి, సన్నివేశంలోని గాఢతను పెంచి, రక్తి కట్టించవచ్చు. ప్రేక్షకుడికి సినిమా నచ్చితే పదేపదే చూసే సులువు వుంది. సినిమా తొలి రోజుల్లో ముడిం ఫిల్ము కొరత వుండేది. కొన్ని పరికరాలను దిగుమతి చేసుకోవలసి వచ్చేది. పోనుపోను దేశం అభివృద్ధి చెందిన కొద్దీ యిలాటి సమస్యలకు పరిష్కారం లభించింది. తక్కిన ఏ పరిశ్రమలో కంటె సినిమా పరిశ్రమలో సాంకేతిక అభివృద్ధి కొట్టవచ్చినట్లు కనబడింది. దానివలన ప్రేక్షకుల మనసులపై గాఢంగా ముద్ర వేయగలిగింది. ఇలాటి కారణాల చేత సినిమా అనేది ఒక బలమైన భావప్రసారసాధనంగా, ప్రచారోపకరణంగా మారింది. దీన్ని వినోదానికి, వికాసానికి, విప్లవానికి, సామాజికపరివర్తనకు, తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుంటూ వచ్చారు, వస్తున్నారు.

సినిమా తారలు తమ ప్రజాదరణను రకరకాలుగా వాడుకుంటున్నారు. కొందరు యాడ్స్ యిచ్చి డబ్బు సంపాదిస్తే, కొందరు ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు, మరి కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారు. సినిమా చూడడానికి కొన్నయినా సాంకేతిక పరికరాలు కావాలి. సినీగీతాలు వినడానికి రేడియో, ట్రాన్సిస్టర్, యిప్పుడైతే సెల్‌ఫోన్ చాలు. అందువలన పని గట్టుకుని థియేటర్లకు వెళ్లనివాళ్లకు సైతం, రేడియో ద్వారా సినీగీతాలు చెవిలో పడుతూ వచ్చి, ప్రభావితమవుతున్నారు. మనిషి జీవితంలోని నవరసాలను స్పృశించడంతో బాటు ఆ గీతాలను ఆ బాణీలు ప్రజల్లో ఎంత బాగా నాటుకుపోయాయంటే అనేక దేవుళ్లపై భక్తిగీతాలు సినీబాణీల్లో కూర్చారు. సినీగీతాల ద్వారా కూడా సినిమా వ్యాపారం వ్యాప్తి చెందుతోంది. ఇలా యింట్లోనే కూర్చున్నా సినిమాలు సామాన్యుడి జీవితాన్ని ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తున్నాయి.

సినిమా పరిశ్రమ అంటే 100 కోట్ల సినిమా వాళ్లు, 30 కోట్లకు పైబడి డిమాండు చేసే హీరోలు కాదు, చిన్న, మధ్యతరహా సినిమా తీసేవాళ్లు కూడా పరిశ్రమలో భాగమే. వాళ్లు కూడా బతికి, బాగుపడే విధానం గురించి మనం ఆలోచించాలి. దానికి గాను సినిమా పరిశ్రమ అనేది థియేటర్ సెంట్రిక్‌గా మారాలి. థియేటర్లకు జనం వెళ్లాలి, థియేటర్లు తమ కలక్షన్లపై సవ్యంగా ప్రభుత్వానికి పన్ను కట్టాలి, ప్రభుత్వాలు వినోదపు పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని సినిమా పరిశ్రమకు కావలసిన సౌకర్యాలపై వెచ్చించి, దాని అభివృద్ధికి దోహదపడాలి. ఇదేమీ ధర్మకార్యం కాదు. సినిమా పరిశ్రమ పైన చెప్పినట్లుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమందికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి ప్రభుత్వానికి వేరే రకాలుగా పన్నులూ వస్తాయి. నిరుద్యోగిత కొంతమేరకు తగ్గించగలదు.

ఇదంతా జరగాలంటే థియేటర్లకు జనాలను రప్పించాలి. ఎలా? ఒక ప్రేక్షకుడిగా నా ఆలోచనా ధోరణి చెప్తాను. సినిమా థియేటర్ అనేది ఊరిలో వుండవలసిన ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే కొత్త బట్టలు కొనుక్కుని నలుగురికి చూపాలన్నా, పండగ వచ్చినా, ఏదైనా ఒక సందర్భాన్ని గుర్తు పెట్టుకోవాలన్నా, కుటుంబమంతా సరదాగా సమయం గడపడానికి వెళ్లాలనుకున్నా, తప్పనిసరి ఫంక్షన్లు కాకుండా భార్యా బిడ్డలను నెలకోసారైనా సరదాగా బయటకు తీసుకెళ్లాలనుకున్నా, సినిమా థియేటర్ ఒక్కటే గమ్యస్థానం. నగరాలలో తప్ప మన వూళ్లల్లో పార్కులు లేవు, విహారస్థలాలు లేవు. సినిమాలు మన కలలకు ముడిసరుకు అందిస్తాయి. ఇంట్లో టీవీలో, ఓటిటిలో సినిమా చూసినా యింట్లో వుండి వుండి బోరు కొడుతుంది కాబట్టి బయటకు వెళ్లడానికి సినిమా ఒక ఎక్స్‌క్యూజ్. పైగా యాక్టరు నాని చెప్పినట్లు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఒక ప్రత్యేకమైన అనుభూతి. సినిమాను కలక్టివ్ డ్రీమ్ అన్నారు. అందరితో కూర్చుని చూసినప్పుడు నవ్వు కానీ, ఏడుపు కానీ యిన్ఫెక్చువస్. ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.

నా మట్టుకు నాకు టీవీ సీరియల్‌ను టీవీలో చూడబుద్ధవుతుంది, సినిమాను సినిమా థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా ఫ్రేమింగ్ అదీ తెర సైజు బట్టి వుంటుంది. పైగా థియేటర్లో ఉండేటంతో అత్యున్నత సాంకేతిక యింట్లో వుండదు. థియేటర్లో ఏకాగ్రతతో చూస్తాం కాబట్టి లీనమౌతాం. ఇంట్లో అనేక అంతరాయాలతో చూడడంతో పూర్తిగా యిన్‌వాల్వ్ కాలేము. సినిమాస్కోప్ సినిమాను అరచేతిలో పట్టే సెల్‌లో చూసేసి, సినిమాను ఎంజాయ్ చేశాం అనుకునేవాడు ప్రేక్షకుడే కాదు. పైరసీ వలన మంచి సినిమా దెబ్బ తింటుంది అంటే నేను నమ్మను. పైరసీ కారణంగా సినిమా కథ తెలియవచ్చు తప్ప మంచి సినిమా అనుభూతి కోరుకునేవాడు థియేటరుకి వచ్చి తీరతాడు.

నేను థియేటరుకి వచ్చి చూడాలంటే అది ఎలాటి సినిమా అయివుండాలి? 2 కోట్లతో తీసే సినిమా కోసమైతే రాను. దాన్ని టీవీలోనో, నెట్‌ఫ్లిక్స్‌లోనో చూడవచ్చు. 10-15 కోట్లతో తీసే సినిమా అయితే నాకు టిక్కెట్టు కిట్టుబాటవుతుంది. ఆ ఖర్చు కూడా నాకు తెర మీద కనబడాలి. హీరోయిన్ హెయిర్‌డ్రస్సర్‌కు కారు బహుమతిగా యిచ్చాం కాబట్టి అంత ఖర్చయిందంటే నాకు ఒళ్లు మండుతుంది. అయ్యప్పనుమ్, కోషియుమ్ సినిమాను ఒటిటి లో చూశాను. మామూలు లొకేషన్స్. దానికి ఏమంత ఖర్చయివుంటుంది? దాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు 70 కోట్లిచ్చాం, రానాకు 20 యిచ్చాం, మిగతా అంతా చుట్టేశాం, మొత్తం 120 కోట్లయింది, 300 రూ.లు టిక్కెట్టు పెడతాం, వచ్చి చూడు అంటే నేనెందుకు చూస్తాను? ఆ కథకు అంత అవసరమా? అనిపిస్తుంది. ఏదో సైరా లాటి హిస్టారికల్. సెట్టింగులకు చాలా ఖర్చయింది అంటే పోనీలే అనుకుంటాను.

ఏతావతా చెప్పేదేమిటంటే నేను ఒక టౌనులో వుంటే 10-15 కోట్లతో తీసే సినిమాలు నెలకు ఓ మూడు వస్తే, టిక్కెట్టు 100 రూ.ల లోపు వుంటే, వాటిలో ఒకటి తప్పకుండా చూస్తాను. అతివృష్టి, అనావృష్టిలాగ పండగ సీజన్లో మూడు, నాలుగు సినిమాలు వదిలి, వాటిలో ఒకటి మాత్రమే హిట్టయి, తక్కినవి చతికిలపడడం, తర్వాత కొన్ని నెలలపాటు ఏ సినిమాలూ లేక ఎండగట్టడం, సినిమా కెళ్లాలంటే లో బజెట్ సినిమాలు మాత్రమే వున్నానడం.. ఎందుకిదంతా? సినిమా నాకు నిత్యావసరం కాకపోయినా మాసావసరం. కంటిన్యువస్‌గా ఫీడ్ చేయవలసిన బాధ్యత మీది.

నన్ను థియేటరుకి రప్పించాలంటే పెద్ద హీరో అక్కరలేదు. మంచి సినిమా అయి వుండి, థియేటర్లు నీట్‌గా వుండి, టిక్కెట్టు రూపేణా దోచేయకుండా వుంటే చాలు. 10-15 కోట్ల రేంజిలో సినిమా తీయడమంటే హీరో పేరు చెప్పి అమ్మేయగలమనే ధీమా సడలి, ఒళ్లు దగ్గరపెట్టుకుని, కథ మీద దృష్టి పెట్టి సినిమా తీయాలనే బుద్ధి కలుగుతుంది. నిజానికి ఆ రేంజిలో సినిమా తీస్తే కాస్త నష్టం వచ్చినా తేరుకోవడం నిర్మాతకు యీజీ. భారీ సినిమాలు ఫ్లాపయితే కోలుకోలేకుండా అయిపోతున్నారు. రిటర్న్ ఆన్ యిన్వెస్ట్‌మెంట్ లెక్కవేసి చూస్తే లవ్‌స్టోరీకి వచ్చే లాభం వకీల్ సాబ్‌కు వచ్చి వుండదు. కానీ భారీ సినిమా తీయగానే మొదటి రోజు కలక్షన్ యింత అని ప్రకటించుకుంటున్నారు. టాక్స్ వాళ్లు గట్టిగా నిలదీస్తే ఆ అంకెలన్నీ బోగస్, పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నాం, బోల్డంత పెట్టుబడి పెట్టాం కదా అని చెప్పుకుంటున్నారు. అంటే సరుకు లేని సినిమాకి హీరో పేరు చూసి హెచ్చురేటు పెట్టి కొని మీరు ఏమారిపోయారు, ఆ తర్వాత ప్రేక్షకులను ఏమారుద్దామని చూస్తున్నారు.

మీ కబుర్లు విని థియేటరుకి వెళ్లిన ప్రేక్షకుడు మిమ్మల్ని తిట్టుకుంటున్నాడు. తెనాలి రామలింగడి పిల్లిలా థియేటర్‌కి వెళ్లడమే మానేశాడు. అతి పబ్లిసిటీ యిండస్ట్రీని దెబ్బ తీస్తోందని మీరెప్పుడు గుర్తిస్తారో తెలియదు. నిజానికి సినిమాని వారం, పది రోజులు ఆడనిస్తే ఏ పబ్లిసిటీ అక్కరలేకుండానే మౌత్ టాక్‌తో సినిమా యింకో పది రోజులు ఆడేస్తుంది. కానీ పదిరోజులు ఆడనిస్తే బండారం బయటపడుతుందని మీ భయం. అందుకని ఒకేసారి ఊళ్లో హాళ్లన్నిటిలో గుప్పించేసి, డబ్బులు నొల్లుకుని మాయమై పోతున్నారు. గతంలో మా సినిమా 100 రోజులు ఆడిందని గర్వంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ ప్రెస్టేజి అక్కరలేదు. మా సినిమా యింత డబ్బు చేసుకుంది, అఫ్‌కోర్స్ దానికోసం మేం చాలా వేషాలే వేయాల్సి వచ్చిందనుకోండి అని చెప్పుకుంటున్నారు.

ఒక సినిమా ఒక థియేటర్లో రిలీజై బాగా ఆడుతోందనుకోండి. వెంటనే మీరు దాన్ని మూడు, నాలుగు థియేటర్లలో రిలీజు చేసేసి డబ్బులు ధనధనా లాగేద్దామని చూస్తున్నారు. దాంతో ఒరిజినల్ థియేటర్ వెలవెలబోతోంది. దీన్ని ఎదుర్కునే దన్ను థియేటర్లకు వుండటం లేదు. థియేటర్లు నిండాలంటే, యిలాటివి మానుకోవాలి. సినిమా రన్ అనేది ముఖ్యం. ఈలోపున టీవీలో వచ్చేస్తుంది, ఓటిటిలో వచ్చేస్తుంది అని బెంగపడడం అనవసరం. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చి తీరతారు. దానికి అనువైన పరిస్థితులు కల్పించాల్సింది మీరు. థియేటర్లు నిలబడాలంటే యిలా మీరు చేయాల్సిన పనులెన్నో వున్నాయి. మొదటి రెండు వారాల్లో టిక్కెట్లు పెంచేసి, డబ్బు లాగుదామని మీరు చూస్తున్నారు తప్ప దానివలన థియేటర్లకు వచ్చే లాభమేముంది? మీరు ఏ ఫిగర్లు చెప్పినా అక్కడ థియేటర్లు నిండటం లేదు. దానివలన నష్టపోతున్నారు వాళ్లు. దానికి బదులుగా మంచి సినిమాలు రీజనబుల్ బజెట్‌లో తీసి, నాలుగైదు వారాల పాటు ఆడేట్లా చేస్తేనే థియేటరు వాళ్లు సంతోషిస్తారు. అది మానేసి ప్రభుత్వాన్ని తప్పుపడితే ఎలా?

టీవీలు వచ్చినపుడు సినీథియేటర్లు మూతపడతాయనుకున్నారు. కానీ టీవీలు, సినిమాలు పరస్పరాశ్రితాలయ్యాయి. ఇప్పుడు యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చాక అదే అనుకుంటున్నారు. కానీ యివన్నీ సహజీవనం సాగిస్తాయని గ్రహించవచ్చు. ఇన్ని అనుకూలాంశాలు వున్నా వేరే ఏ పరిశ్రమలోనూ లేనంత వైఫల్యం సినీపరిశ్రమలో కనబడుతోంది. చాలా సినిమాలు నిర్మాణదశలోనే ఆగిపోతాయి. రామానాయుడు గారైతే విడుదలైన సినిమాల్లో 10శాతం సినిమాలు మాత్రమే లాభాలు ఆర్జిస్తాయని అనేవారు. చిరంజీవి దాన్ని 15 దాకా లాగారు. మరో 5-10 శాతం సినిమాలకి పెట్టుబడి వెనక్కి వస్తుందనుకుందాం. తక్కిన సినిమాలన్నీ ఎంతోకొంత నష్టాన్ని భరించేవే! ఇంతటి నష్టదాయకమైన పరిశ్రమలోకి నిరంతరం పెట్టుబడి వచ్చిపడడం ఆసక్తి కలిగించే అంశం. వాటి గురించి సినిమా టిక్కెట్లు ఎవరమ్మితే ఏమిటి? అనే వ్యాసంలో చర్చిద్దాం. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

[email protected]