సీఎం సంగతి సరే.. మరి పత్రికలు?

సీఎం పొజిషన్‌లో వ్యక్తిగత రాగద్వేషాలు వుండకూడదు, ధర్మకర్తగా, చట్టబద్దంగా వుండాలని అన్నారు ఆంధ్రజ్యోతి ఆర్కే. ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసేవారి పట్ల పార్టీలు వ్యతిరేకత పెంచుకోవచ్చు కానీ, ముఖ్యమంత్రి కాదని ఆర్కే బలంగా వాదించారు. …

సీఎం పొజిషన్‌లో వ్యక్తిగత రాగద్వేషాలు వుండకూడదు, ధర్మకర్తగా, చట్టబద్దంగా వుండాలని అన్నారు ఆంధ్రజ్యోతి ఆర్కే. ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాసేవారి పట్ల పార్టీలు వ్యతిరేకత పెంచుకోవచ్చు కానీ, ముఖ్యమంత్రి కాదని ఆర్కే బలంగా వాదించారు. 

నిజమే.. అధికార స్థానాల్లో వున్నవారు ధర్మబద్దంగా, నిస్పక్షపాతంగా వుండాలి. మరి అదే సూత్రం పత్రికల యజమానులకు, ఎడిటర్లకు వర్తించదా? అన్నదే అనుమానం.

కేటీఆర్.. దాన్నే సింపుల్‌గా న్యూస్ పేపర్లు, వ్యూస్ పేపర్లుగా మారవచ్చా? అని అడిగారు. పత్రిక నడిపేవారు ప్రభుత్వం మీద విమర్ళలు చేయచ్చు, తప్పు లేదు. కానీ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులను టార్గెట్ చేయకూడదు కదా. 

నిత్యం సీఎం స్థాయి వ్యక్తిని టార్గెట్ చేయచ్చు పత్రికలు. అక్కడ ధర్మబద్దంగా వుండనవసరం లేదు. కానీ అలా టార్గెట్ చేయబడిన సీఎం మాత్రం తాను అధికార పదవిలో వున్నాను కనుక రివర్స్ కాకూడదు అలా సాగింది ఆర్కే వాదన.

మరో విషయంలో కూడా కేటీఆర్-ఆర్కే మధ్య ఆసక్తికర చర్చ నడించింది. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వల్లే జగన్ గెలిచారని, అందువల్లే ఇప్పుడు సెటిలర్లు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారని ఆర్కే అన్నారు. 

గిఫ్ట్ అనేది ఇస్తేనే రిటర్న్ గిఫ్ట్ అనేది వుంటుందని, తెలుగుదేశం తన బద్ద వ్యతిరేకి అయిన కాంగ్రెస్ తో కూటమి కట్టి తెరాస ను ఓడించే ప్రయత్నం ఎందుకు చేయాలని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కానీ కేవలం కేసాఆర్ వల్ల జగన్ గెలిచారంటే తప్పు అని క్లారిటీగా రివర్స్ అటాక్ ఇచ్చారు. ఆంధ్ర జనాలు జగన్ ను గెలిపించాలని బలంగా అనుకున్నారు కనుకే అంత భారీ మెజారిటీ ఇచ్చారని కేటీఆర్ అన్నారు.