బీజేపీతో పొత్తు పెట్టుకొని అన్ని విధాలుగా నష్టపోయారు, నష్టపోతున్నారు పవన్ కల్యాణ్. తెలంగాణలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక వరకు ప్రతి విషయంలో బీజేపీ ముందు ఒంగిపోయారు. సొంత పార్టీని పడుకోబెట్టారు… చివరకు గాజు గ్లాసు గుర్తుకే ఎసరు తెచ్చుకున్నారు.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి, గాజువాకలో పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు పవన్. గతంలో తాను ఓడిపోయిన గాజువాకలో వచ్చే ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరచాలని, వ్యక్తిగతంగా తన పరపతి పెంచుకుని 2024 నాటికి బలంగా ఎదగాలని ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారబోతున్న ఈ సమయంలో ఉత్తరాంధ్రలో పట్టుపెంచుకోవడం జనసేనానికి బాగా అవసరం. అందుకే పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు.
కానీ ఇక్కడ కూడా పవన్ కి బీజేపీ అడ్డంగా ఉంది. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటే తప్ప ఉక్కు ఉద్యమంలోకి పవన్ అడుగుపెట్టలేరు. స్టీల్ ప్రాంట్ ప్రైవేటీకరణ విషయంలో మిత్రపక్షం బీజేపీతోనే పవన్ ఫైట్ చేయాల్సిన పరిస్థితి.
కాపు రాజకీయాలకు కూడా బీజేపీయే అడ్డంకా..?
ఇన్నాళ్లూ కాపు సంఘాలకు, కాపు ముద్రకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్, ఇప్పుడు తన సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో రెండు బలమైన సామాజిక వర్గాలకు రెండు పార్టీలు అండగా నిలబడ్డాయి. కాపులను ఆ రెండు పార్టీలు చేరదీసినా.. అది తాత్కాలికమేననే అనుమానం వారిలో ఉంది. ఈ దశలో పవన్ కల్యాణ్ కాపు నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అందరివాడిగా ఉంటూనే.. కాపులకు దగ్గరై వారి సంపూర్ణ మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని ఆలోచిస్తున్నారు.
అందుకే ఇటీవల కాలంలో కాపు నేతలను దగ్గర తీయడంతో పాటు.. కాపు రిజర్వేషన్లపై కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. తాజాగా సినిమా టికెట్ల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్.. పనిలో పనిగా కాపు రిజర్వేషన్లను లేవనెత్తారు. అయితే రిజర్వేషన్లు ఇస్తానంటూ మోసం చేసిన చంద్రబాబుని నిలదీయాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ తో పవన్ కి షాకిచ్చారు వైసీపీ నేతలు. వైసీపీ సంగతి పక్కనపెడితే.. ఇక్కడ కూడా బీజేపీతో పవన్ కి చిక్కొచ్చి పడింది.
రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్న అంశం. బీజేపీతో పొత్తు పెట్టుకొని, రిజర్వేషన్లపై పవన్ పోరాటం చేయలేరు. అలా చేసినా దాన్ని ప్రజలు నమ్మరు. పైపెచ్చు అసహ్యించుకుంటారు.
పవన్ కాపుల పక్షాన నిలబడాలంటే, వారి రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. కానీ ఓవైపు బీజేపీతో కాపురం చేస్తూ, మరోవైపు కాపు రిజర్వేషన్లపై మాట్లాడితే ఎవరూ నమ్మరు. 2024లో తన ఉనికి చాటుకోవాలంటే.. కాపుల కోసం పోరాటం చేస్తూనే బీజేపీకి దూరం జరగాలి. పవన్ అంత సాహసం చేస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.