టైటిల్: లవ్ టుడే
రేటింగ్: 3/5
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, ఇవాన, రవీన రవి, సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్ తదితరులు
కెమెరా: దినేష్ పురుషోత్తమన్
ఎడిటింగ్: ప్రదీప్ ఇ రాఘవ్
సంగీతం: యువన్ శంకర్ రాజ
నిర్మాతలు: అఘోరం, గణేష్, సురేష్
దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్
విడుదల తేదీ: 25 నవంబర్ 2022
సరిగ్గా మూడు వారాల క్రితం తమిళంలో విడుదలై పెట్టుబడికి 15 రెట్లు వసూలు చేసిన చిత్రం “లవ్ టుడే”. ప్యాడింగ్ గా సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు ఉన్నా మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే. పైగా “కాంతార” మాదిరిగా ఇక్కడ కూడా దర్శకుడు, హీరో ఒకడే.
నేటి యువతని టార్గెట్ చేసి ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించి తీసిన సినిమా ఇది. టైటిల్ కి తగ్గట్టుగా నేటి మొబైల్ ఫోన్, సొషల్ మీడియా ప్రేమలు, పెటాకులు, నేరాలు ఎలా ఉన్నాయో చూపిస్తూ అద్యంతం సరదాగా సాగే స్క్రీన్ ప్లే తో తీసిన న్యూ ఏజ్ సినిమా ఇది.
ఇందులో ప్రధానంగా అడ్రస్ చేసిన అంశాలు మూడు
1. మగ, ఆడ తేడా లేకుండా పెట్టుకునే మల్టిపుల్ సోషల్ సంబంధాలు
2. ట్రోలింగులు, బాడీ షేమింగులు
3. స్త్రీలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ద్వారా చేసే సైబర్ నేరాలు
అంశాలు అందరికీ పరిచయమైనవే. ప్రేక్షకులని కనెక్ట్ చేసే విషంగా లైటర్ వీన్ లో డయలాగ్, స్క్రీన్ ప్లే రాసుకోవడంతో స్క్రిప్ట్ విషయంలోనే పాసైపోయారు. తర్వాత అనుకున్నట్టుగా నటన కూడా పండడంతో పూర్తిగా అనుకున్న లక్ష్యాన్ని చేరిపోయారు టీమంతా.
ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ వ్యవహారాన్ని ఒప్పుకునే ముందు అమ్మాయి తండ్రి తెలివిగా వారిద్దరికీ ఒక పరీక్ష పెడతాడు. ఇద్దరూ ఒకరి ఫోన్ ని ఒకరు మార్చుకుని రెండ్రోజులు గడపాలి. దాంతో ఒకరి రహస్యస్నేహితులు ఒకరికి తెలిసిపోతారు. అప్పటివరకు ఇద్దరూ ఒకరికొకరు పారదర్శకంగానే ఉంటున్నామన్న భ్రమల్లోంచి బయటికొచ్చి రకరకాల భావోద్వేగాలకి, గొడవలకి దిగుతారు. తెర మీద జరుగుతున్నది సీరియస్ మ్యాటరే అయినా దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరుని మెచ్చుకోవాలి.
యోగిబాబుని ఇందులో కామెడీకి కాకుండా సెంటిమెంట్ కోసం వాడుకోవడం బాగుంది. దర్శకుడు ఏయే అంశాలు ప్రేక్షకులకి ఎలా కనెక్ట్ కావాలనుకున్నాడో అదే విధంగా కనెక్ట్ చేయగలిగాడు. ఎక్కడా “అతి”కి పోకుండా, అలాగని సినిమాటిక్ ఫ్లావర్ తగ్గకుండా ప్రతి ప్రేక్షకుడు కథతో ప్రయాణం చేసే విధంగా రాసి, దర్శకత్వం వహించి, నటించాడు ప్రదీప్ రంగనాథన్.
తమిళంలో బాగా ఆడిందన్న వార్త తెలుసుకున్న తెలుగు ప్రేక్షులు దీనికి తొలిరోజు మంచి స్పందనే అందించారు. సోషల్ మీడియా వాడుతున్న ప్రతివారికి సెన్స్ అండ్ సెన్సిబిలిటీని పాఠంగా చెబుతున్నట్టు కాకుండా ఒక స్నేహితుడు చెబుతున్నట్టుగా చెప్పాడు దర్శకుడు. అదే ఇందులో ప్లస్ పాయింట్.
టెక్నికల్ గా చూస్తే పాటలు కూడా సరదాగా డీజే మిక్స్ స్టైల్లోనూ, ఇతర ట్రెండీ పద్ధతుల్లోనూ సాగాయి. సంభాషణలన్నీ సహజమైన ఫ్లోలో పాత్రోచితంగా ఉన్నాయి. కెమెరా, ఎడిటింగ్ అన్నీ ఎంతుండాలో అంత ఉన్నాయి. నిజానికి సినిమా నిడివి ఎక్కువగానే ఉన్నా ట్రీట్ చేసిన విధానం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు.
నటన పరంగా ప్రదీప్ రంగనాథన్ మెప్పించాడు. మరొక ధనుష్ లాగ, పక్కింటబ్బాయి ఫీచర్స్ తో మంచి ఫ్యూచర్ ఉన్నట్టుగానే కనిపించాడు. కథానాయిక ఇవాన కీలకమైన సన్నివేశాల్లో చక్కని నటన కనబరిచింది.
రవీన రవి చూడ్డానికి పాత్రకు కావాల్సిన అందంతో కనిపించింది.
సత్యరాజ్ ది ఆసక్తికరమైన పాత్ర- టెక్ సావీ గా కనిపించే అమ్మాయి తండ్రి. అయినప్పటికీ ఒక సన్నివేశంలో కూతురు నిజంగానే తప్పు చేసిందని నమ్మి, కోపంతో వీరంగం చేసి అప్పటివరకు చూపించిన మెచ్యూరిటీని పక్కనపెడతాడు. అదొక్కటీ లేకుండా ఉంటే ఈ పాత్ర ఇంకా బలంగా ఉండేది.
రాధిక శరత్ కుమార్ ది ముందుగా రొటీన్ పాత్రే అనిపించినా క్లైమాక్స్ ముందు ఒక కీలకమైన సన్నివేశంలో చక్కని డయలాగ్స్ చెబుతుంది.
దర్శకుడిలో విషయముందని తరచూ వచ్చే ఒక సింబాలిక్ సన్నివేశం చెబుతుంది. ఒక చిన్నపిల్లవాడు మామిడి టెంకను మట్టిలో నాటి నీళ్లు పోసి మొక్కయ్యిందా లేదా అని రోజూ చూస్తుంటాడు. అనుమానమొచ్చినప్పుడల్లా ఆ టెంకని తవ్వి తీసి మళ్లీ మట్టిలో కప్పెడుతుంటాడు. చివరి సన్నివేశంలో మొక్క రాలేదని ఏడుస్తాడు. అప్పుడు అతని తల్లి వచ్చి చెబుతుంది, “అలా రోజూ టెంకని బయటికి తీసి చూస్తే మొక్క రాదు. పెరుగుతుందన్న నమ్మకంతో నాటి వదిలేయాలి. అప్పుడే పెరుగుతుంది” అంటుంది. ప్రేమ కూడా అలాంటిదే. అనుమానం లేకుండా ప్రేమని నాటి వదిలేయాలి. రోజూ చెక్ చేసుకుంటూ, ఎదుటి వారి మనసులో ప్రేమ మొలకెత్తుతోందా లేదా అన్న అనుమానంతో తవ్వి తీస్తూ కూర్చుంటే పెరగదు.
నేటి తరం సమాజానికి అద్దం పట్టే సినిమా ఇది. ఎవరికి వారు తాము చేస్తున్న తప్పొప్పుల్ని అద్దంలా ప్రతిబింబింప చేసే సినిమా కనుక తప్పక చూడొచ్చు. ప్రధానపాత్రలు తప్పులు చేసినా చివరికి ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్న తీరు బాగుంది. తెలిసిన విషయాలే అయినా సోషల్ మీడియాని ఎలా వాడొచ్చు, ఎలా వాడకూడదు, ఏది సరదా, ఏది క్రైం వంటివన్నీ ఒకసారి చుట్టేయొచ్చు.
బాటం లైన్: సీ టుడే