కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు మరోమారు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఏర్పాటు చేసే పనిలో జగన్ సర్కార్ నిమగ్నమైంది. దీంతో ఎన్టీఆర్ పేరు గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని కృష్ణా జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెడతామని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారని, ఆయన మాట ఇచ్చారంటే కచ్చితంగా నిలబెట్టుకుంటారని అన్నారు. వల్లభనేని వంశీ టీడీపీ తరపున గన్నవరం నుంచి గెలుపొంది…ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించి అసెంబ్లీలో ప్రత్యేక సీటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
వంశీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. కరోనా విజృంభణపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఎవరైనా కరోనాతో ఇబ్బంది పడుతుంటే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 0866- 2428666కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.