ఉమ్మడి కామెడీ: మరో మినీ మేనిఫెస్టో!

మేనిఫెస్టో అంటేనే ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. రాబోయే అయిదేళ్లలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ప్రమాణ పత్రం. దీనిని కాస్తా తెలుగుదేశం జనసేన పార్టీలు కామెడీగా మార్చేస్తున్నాయి. మేము ఏదో ఒకటి చేస్తున్నాం అని…

మేనిఫెస్టో అంటేనే ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. రాబోయే అయిదేళ్లలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ప్రమాణ పత్రం. దీనిని కాస్తా తెలుగుదేశం జనసేన పార్టీలు కామెడీగా మార్చేస్తున్నాయి. మేము ఏదో ఒకటి చేస్తున్నాం అని ప్రజల వద్ద బిల్డప్ ఇచ్చుకోవడానికి ఈ మేనిఫెస్టో అనే పదాన్ని ఒక మార్గంలాగా వాడుకుంటున్నాయి.

తెలుగుదేశం పార్టీ విషయంలో మేనిఫెస్టో అనేదే ఒక కామెడీ కాగా, ఈ దఫా ఈ రెండు పార్టీలు కలిసి ఆ కామెడీని పండిస్తూఉండడం గమనించాల్సిన సంగతి.

ఇప్పటికే తెలుగుదేశం ఒకసారి, అంటే ఈ ఏడాది మేలో మహానాడు సందర్భంగా, మినీ మేనిఫెస్టో అనే ప్రహసనం ప్రకటించింది. జనసేన వారితో పొత్తు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత.. వారి ఉత్సాహం అసలే పరవళ్లు తొక్కుతోంది. వారికి కూడా మేనిఫెస్టో అనే పదం మీద చాలా ఉబలాటం ఉంది. 

తాము దేశాన్ని ఉద్ధరించేస్తామని అధికారికంగా ప్రకటించాలని ఉంది. అందుకే వారు ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి అనేక అంశాలతో తమ ప్రతిపాదనల మేనిఫెస్టోను తయారుచేశారు. అయితే వారి మీద అతిగా ఆధారపడిన తెలుగుదేశం, ఆ ఉత్సాహాన్ని కాదనలేక ప్రస్తుతానికి అయిదు అంశాలను మాత్రం తీసుకుని, తమ పార్టీ తరఫున మరో ఆరు అంశాలు జోడించి.. 11 అంశాలతో మరో మినీ మేనిఫెస్టో విడుదల చేసింది.

అంటే తెలుగుదేశం కూటమి తరఫు నుంచి ఇప్పటికే రెండు మినీ మేనిఫెస్టోలు విడుదల అయినట్టు అనుకోవాలి. అసలైన మేనిఫెస్టో చివర్లో ఇంకోటి కూడా విడుదల చేస్తారట. అదేదో మహాభారతం లాగా.. ఒక ఉద్గ్రంధాన్ని వండే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఈ కామెడీ మేనిఫెస్టోలో ‘‘రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం’’ వంటి ప్రపంచంలో ఎవ్వరికీ అర్థంకాని అంశాలు కూడా ఉన్నాయి. ‘రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన’ అనే మాట కూడా అలాంటిదే. 

తెలుగుదేశం పార్టీ తాము అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలను , జగన్ సర్కారు కుట్రపూరితంగా రద్దు చేసిందని గోల చేస్తూ వచ్చింది. వారి ఆరోపణలు నిజమే అయితే గనుక.. వారు దమ్ముగా.. జగన్ సర్కారు రద్దుచేసిన పథకాలు అన్నింటినీ తాము తిరిగి అమలులోకి తీసుకువస్తాం అని ప్రకటించవచ్చు. కానీ.. అలా చెప్పడానికి ధైర్యం చాలడం లేదు.

సొంత వారికి మేలు చేసుకునేలా చంద్రబాబు తెచ్చిన అనేక పథకాలను సంస్కరించి.. విస్తృతంగా జన బాహుళ్యానికి సాయం అందేలాగా జగన్ అమలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో నేరుగా ఏ విమర్శలూ చేయలేక జనసేన- టీడీపీలు తమ మినీ మేనిఫెస్టోలో ఇలాంటి డొంకతిరుగుడు ప్రకటనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.