కర్ణాటక రాజకీయంలో విబేధాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇటీవలే సెక్స్ స్కాండల్ తో అధికార పార్టీ నేత రమేష్ జార్కిహోళి పెను దుమారం రేపారు. ఆ రచ్చ అలా కొనసాగుతూ ఉండగానే, మరో బీజేపీ నేత- మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన ఫిర్యాదుతో సంచలనం రేపారు.
స్వయానా ముఖ్యమంత్రి యడియూరప్ప మీదే ఫిర్యాదు చేశారు ఈశ్వరప్ప. ముఖ్యమంత్రి తన శాఖలో జోక్యం చేసుకుంటూ ఉన్నారని, ఆర్థిక కేటాయింపుల విషయంలో అవకతవకలకు ఆస్కారం ఇస్తున్నారంటూ మంత్రిగారు ముఖ్యమంత్రిగారి మీద ఫిర్యాదు చేయడం గమనార్హం!
సాధారణంగా ముఖ్యమంత్రుల మీద మంత్రులు విధేయతతోనే ఉంటారు. జాతీయ పార్టీల్లో కొన్ని వివాదాలు రేగుతూ ఉంటాయి. మంత్రి పదవి దక్కని నేతలైనా అలాంటి సమయాల్లో తోకాడిస్తూ ఉంటారు కానీ, మంత్రి పదవుల్లో ఉన్న వారు నచ్చినా-నచ్చకపోయినా గుంభనంగా ఉంటారు. వీలైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం జరుగుతూ ఉండేది కాంగ్రెస్ హయాంలో!
అయితే కాంగ్రెస్ వాళ్ల కన్నా ఘనుల్లా తయారైన కమలం పార్టీ నేతలు ఇలా బహిరంగ ఫిర్యాదులకే రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రి అవినీతి పరుడు అన్నట్టుగా, తన శాఖ ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నట్టుగా కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఆ రాష్ట్ర గవర్నర్ కు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఆ ఫిర్యాదు కాపీని.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా పంపించారట ఈశ్వరప్ప!
ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును తప్పు పడుతూ ఆయన కేబినెట్లోని మంత్రే గవర్నర్ కు ఫిర్యాదు చేయడం బహుశా ఇది వరకూ జరిగి ఉండకపోవచ్చు. కర్ణాటక రాజకీయంలో ప్రస్తుతం యడియూరప్ప చాలా లోకువ అయ్యారు. సొంత పార్టీ నేతలే ఆయన మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. యడియూరప్పను అధిష్టానం తప్పిస్తుందని బహిరంగంగానే కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
ఇటీవల వివాదంలో చిక్కిన రమేష్ జార్కిహోళి కూడా యడియూరప్పను అవినీతి పరుడుగా అభివర్ణించారు. మాజీముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ఉత్తముడని ఆ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఇక మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని యడియూరప్ప దాదాపు ఏడాదిన్నరగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అందుకు కమలం పార్టీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు.
ఆ పనిమీద పలుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చి కూడా యడియూరప్ప అనుకున్నది చేయలేకపోయారు. ఈ క్రమంలో ఆయన కేబినెట్లోని మంత్రి కూడా ఆయన మీద కంప్లైంట్ చేసి, దాన్ని మీడియాకు కూడా లీకిచ్చాడు. యడియూరప్పను తప్పిస్తే కర్ణాటకలో తమ కూసాలు కదులుతాయేమో అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుంది.
గతంలో ముఖ్యమంత్రులను డమ్మీలను చేసి ట్రీట్ చేసిన ఘనత కాంగ్రెస్ కే సొంతం గా ఉండింది. వరసగా రెండో పర్యాయం అధికారం అందిన అనంతరం అచ్చం కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నట్టుగా అగుపిస్తున్న బీజేపీ.. కర్ణాటక రాజకీయాన్ని అలా కామెడీగా చేస్తోంది!