కరోనా కల్లోలం ముదిరిపోతోంది. ఈస్ట్ గోదావరిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాలో గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా 12 వందలకు పైగా కేసులు నమోదు కావడం అన్నది కలవరపరిచే విషయం. దీంతో జిల్లా యంత్రాంగం అర్జెంట్ గా ఆదివారాలు కర్ఫ్యూ రోజులుగా ప్రకటించేసింది. అంటే ఇకపై మళ్లీ ప్రకటించేవరకు ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం కర్ఫ్యూ వుంటుందన్న మాట.
నిజానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పోల్చుకుంటే ఈస్ట్ గోదావరి యంత్రాంగం మొదటి నుంచి కాస్త లిబరల్ గా వుంది. అన్ని జిల్లాల కన్నా ముందుగానే ఈస్ట్ గోదావరిలో దాదాపు అన్ని వ్యాపారాలు తెరుచుకున్నాయి. జనం విచ్చలవిడిగా తిరిగేసారు. ఎవరికీ ఏ భయం, పట్టింపు లేకుండా అయిపోయింది. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.
విశాఖ జిల్లాలో లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తే ఈస్ట్ గోదావరిలో మాత్రం లిబరల్ గా వ్యవహరించారు. ఇప్పుడు లాక్ డౌన్ సడలించాక కేసులు రావడం ప్రారంభం కావడంతో, నిబంధనలు కట్టుదిట్టం చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ ఆదివారం నుంచి కర్ఫ్యూ అమలు లోకి తెస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఆదివారాలు మాత్రమే కాదు, కొన్ని రోజుల పాటు పగటి పూట పూర్తిగా కర్ఫ్యూ విధిస్తే తప్ప, వ్యవహారం అందుబాటులోకి వచ్చేలా లేదు..