రానురాను రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మరింత దిగజారుతోంది. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక చతికిలపడిపోతున్నారు నేతలు. కార్యకర్తలకు లేఖలు రాయడం, వారిని సముదాయించడం, నేతలు అరెస్ట్ అయితే ఇంటికెళ్లి కడుపు నిండా భోజనం చేసి రావడం, ఏ కులం వాళ్లు అరెస్ట్ అయితే.. ఆ కులం వాళ్లని రెచ్చగొట్టి ప్లకార్డులు పట్టించి సోషల్ మీడియా ఉద్యమం చేయించడం.. ఇదీ వారి దినచర్య.
అధినాయకుడే సరిగా లేనప్పుడు, భావి నేత ఉత్తర కుమారుడైనప్పుడు ఇక పార్టీ, పార్టీ నాయకులు ఏం చేస్తారు? ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే.. నిమ్మగడ్డ ప్రసాద్ కి ఉద్యోగం ఇప్పించడం. దాని కోసం ప్రెస్ మీట్లు పెట్టారు, రోడ్లెక్కి నిరసనలు చేపట్టారు, కోర్టుమెట్లెక్కారు, ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇన్ని చేసినా ఇంకా ఏదో తెలియని వెలితి. నిమ్మగడ్డకు ఉద్యోగం వచ్చేవరకు టీడీపీ నేతలు నిద్రపోయేట్లు లేరు.
ఆమధ్య బీజేపీ నేతలతో సీక్రెట్ మంతనాలు నెరపి తన వ్యవహారాన్ని తానే బట్టబయలు చేసుకున్నారు నిమ్మగడ్డ. సీసీ కెమెరాల సాక్షిగా అతనెంత పనిమంతుడో రుజువైంది. అలాంటి వ్యక్తికి మళ్లీ ఎన్నికల కమిషనర్ గా విధులు అప్పగించాలట. పోనీ ఇప్పుడేమైనా రాష్ట్రానికి ఆయన అవసరం ఉందా అంటే అదీ లేదు. ఎన్నికలు ఎలాగూ వాయిదా పడ్డాయి. పెరుగుతూ పోతున్న కరోనా కేసులతో ఇప్పుడప్పుడే ఆ ముచ్చట జరిగేలా లేదు. ఇలాంటి టైమ్ లో.. అసలు ఎన్నికల కమిషనర్ ఉద్యోగానికి వచ్చిన తొందరేంటి.
పోనీ ఆయన తొందరపడ్డారంటే అర్థముంది, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎందుకు ఆవేశపడ్డట్టు. ఎన్నికల కమిషనర్ లేకపోతే రాష్ట్రానికి అనర్థమేదో జరిగిపోతుందన్నట్టు అర్జంట్ గా ఆయనకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వండి అంటూ గవర్నర్ కి లేఖ రాయడం ఎందుకు? పచ్చపాత మీడియాతో నిమ్మగడ్డ వ్యవహారం, హైకోర్టు ఆగ్రహం అంటూ హెడ్డింగులు పెట్టుకుని ఆనందించడం దేనికి?
పోనీ నిమ్మగడ్డకు పోస్టింగ్ వస్తే టీడీపీకి ఏమైనా ఒరుగుతుందా, వైసీపీకి ఏమైనా తరుగుతుందా? ఏకగ్రీవాలు క్యాన్సిల్ అయితే.. తిరిగి అక్కడ పోటీచేసే దమ్ము టీడీపీకి ఉందా? స్థానిక ఎన్నికలు వాయిదా పడిన తర్వాత ఎంతమంది టీడీపీని వదిలి వైసీపీలో చేరారో లెక్కేసుకోండి. ఆ లెక్కన ఎన్ని స్థానాలు వస్తాయో ఊహించుకోండి.
ఈమాత్రం దానికి ఎందుకింత హడావిడి. ఈలెక్కన గవర్నర్ నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇచ్చి, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒప్పుకుంటే.. టీడీపీ శ్రేణుల సంబరానికి అంతూ పొంతూ ఉండదేమో. ఇలాంటి అల్ప సంతోషులు కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయినా.. ఇంకా బాధ్యత లేకుండా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు చంకలు గుద్దుకుంటున్నారు.