ఏపీ రాజకీయాల్లో చాన్స్‌లపై విస్తృత చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాస్ట్ చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేయడం పెద్ద చర్చకే దారి తీసింది. జనసేనాని పవన్‌కల్యాణ్ ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చాన్స్ ఇవ్వాలని జనాన్ని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరి మొర ఆలకిస్తారనేది ఆసక్తికర అంశమైంది.
ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలని నెటిజన్లు కోరడం విశేషం. అది కూడా ఎమ్మెల్యేగా చాన్స్ కోరుతుండడం గమనార్హం. 2019లో మంగళగిరి నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో లోకేశ్ దిగి, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఓడిపోయే నాటికి లోకేశ్ మంత్రి పదవిలో ఉన్నారు. వడ్డించే వాడు మనోడైతే… బంతిలో ఎక్కడున్నా ఇబ్బంది లేదనే చందాన …తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత మంత్రి హోదాను దక్కించుకోవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
మొదటి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఓడిపోయిన లోకేశ్, రానున్న రోజుల్లో పాదయాత్రకు సిద్ధం కావడంపై ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతున్నారు. తన గెలుపునకే దిక్కులేని లోకేశ్, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తానని రోడ్డెక్కడం విచిత్రంగా ఉందనే విమర్శ ఆకట్టుకుంటోంది. దీనికి టీడీపీ సమాధానం చెప్పాల్సి వుంది. మంగళగిరి నుంచే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు.
మంగళగిరిలో వైసీపీకి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మరోసారి బరిలో దిగాలని లోకేశ్ నిర్ణయించుకోవడం సాహసమే అని చెప్పక తప్పదు. అందుకే లోకేశ్‌కు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ నెటిజన్లు వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. తనకు తాను గెలవలేని లోకేశ్, తన పార్టీ సభ్యుల్ని ఎలా గెలిపించుకుంటారనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఆ కోణంలో నుంచి పుట్టుకొచ్చిందే లోకేశ్‌కు ఒకే ఒక్క చాన్స్ ప్లీజ్ అనే నినాదం.