ఇంకా రెండురోజులు కూడా కాలేదు. జగన్ ప్రభుత్వం మీద తానేదో తిరుగులేని యుద్ధం ప్రకటిస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించి..! అప్పుడే ఆయన తన యుద్ధం గురించి పునరాలోచనలో పడినట్టుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే యుద్ధ ప్రకటన ద్వారా తాను జగన్మోహన్ రెడ్డి పరువు తీయడం ఎంతవరకు సాధ్యం అవుతుందో లేదో తెలియదు గానీ.. అదే మాట ద్వారా.. తన పరువు, తన కొడుకు పరువు పూర్తిగా బజార్న పడడం మాత్రం గ్యారంటీ అని చంద్రబాబునాయుడు గ్రహిస్తున్నారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి.. నెమ్మదిగా ఈ నినాదాన్ని పక్కన పెట్టేద్దాం అని కూడా తలపోస్తున్నట్టు సమాచారం.
అరాచకంగా సాగుతున్న వైఎస్ జగన్ పాలన గురించి తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం అని అంటూ.. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే నినాదంతో 45 రోజుల కార్యక్రమం నిర్వహిస్తాం అని చంద్రబాబు అన్నారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలు స్వీకరిస్తాం అన్నారు. అదంతా బాగానే ఉంది గానీ.. యుద్ధం టైటిల్ విషయంలోనే ఆయన గుంజాటన పడుతున్నారు.
ఇదేం ఖర్మ.. ఇదేం ఖర్మ అంటూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు ఆయనకు బాగా ఘాటుగానే అంటుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీని.. కేవలం 23 సీట్లకు పరిమితం చేసి జనం అంత దారుణంగా ఓడించారంటే.. తన పాలన గురించి.. వారందరూ ఎంత మూకుమ్మడిగా ఇదేం ఖర్మరా భగవంతుడా.. అని ఛీత్కరించుకున్నారో కదా.. అని చంద్రబాబుకు అనిపిస్తోంది.
ఇదే ఖర్మ అనే నినాదం వినిపించిన ప్రతిసారీ, అది తన నోటినుంచి వచ్చినా కూడా.. ప్రజలు తననే అన్నట్టుగా ఆయన బెంబేలెత్తిపోతున్నారు. తన వైఫల్యం, తనను జనం తిప్పికొట్టినదే ఆయనకు గుర్తుకొస్తోంది. రేపు ఈ నినాదంతో డిసెంబరు 1నుంచి ప్రజల్లోకి వెళ్లినా కూడా.. ప్రతిచోటా.. తన గురించే ‘‘ఇదేం ఖర్మ చంద్రబాబూ’’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేయడం చాలా సులభం అయిపోతుందని ఆయన భయపడుతున్నారు.
ఆ మాటకొస్తే.. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ రూపొందించిన కార్యక్రమం ఇది. ఆయన కేవలం ఇదేం ఖర్మ అని పేరు పెట్టారు. అలాగే ప్రజల్లోకి వెళ్లి ఉంటే ఇంకా కామెడీ గా ఉండేది. అయ్యన్నపాత్రుడు కాస్త తెలివిగా దీనికి ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని మార్చారు.
అయినా సరే.. ఈ నినాదం వల్ల నవ్వులపాలు అవుతాం అనే భయం చంద్రబాబులో కలుగుతోంది. అలాగని డిసెంబరు 1 నుంచి ప్రకటించిన కార్యక్రమాన్ని ఆపలేరు. వేరే పేరు పెట్టాలా.. పరువు పోతే పోయింది లెమ్మనుకుని.. ఇదే నినాదంతో ముందుకు సాగాలా? అని ఆయన మధనపడుతున్నారు.