టీడీపీ ముఖ్యనేతలు నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లకు పార్టీ పరంగా హోదాలు మారనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్లో జాతీయ, ప్రాంతీయ హోదాలున్న రాజకీయ పార్టీల వివరాలున్నాయి.
ఇందులో జాతీయ హోదా ఉన్న రాజకీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలున్నాయి. వీటిలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా రాణిస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల విషయానికి వస్తే ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎంలకు ప్రాంతీయ హోదా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇదిలా వుండగా తెలుగుదేశం పార్టీని తమకు తాముగా జాతీయ పార్టీగా ఆ పార్టీ నేతలు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను ముద్దుగా పిలుచుకుంటున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రాంతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌లు తమ హోదాలను కూడా సరిదిద్దుకోవాల్సి వుంది. అలా చేసుకుంటారా లేక జాతీయ హోదాతో కొనసాగుతూ తమకు తాము గొప్పలు చెప్పుకుంటారా? అనేది తండ్రీకొడుకుల విజ్ఞతపై ఆధారపడింది.
తమ పార్టీ హోదా ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసిన తర్వాత కూడా అలాగే కొనసాగితే మాత్రం నవ్వులపాలవుతారనేది జనం మాట.