రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో క్లాష్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ స్ట్రయిట్ సినిమాకు డబ్బింగ్ మూవీ పోటీ ఇచ్చిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు అలాంటి పరిస్థితిని అల్లరి నరేష్ ఎదుర్కొంటున్నాడు.
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాను 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. అదో రోజున థియేటర్లలోకి లవ్ టుడే, తోడేలు అనే రెండు సినిమాలొస్తున్నాయి. ఈ రెండూ డబ్బింగ్ సినిమాలే.
లవ్ టుడే సినిమా తమిళనాట ఆల్రెడీ పెద్ద హిట్. దీన్ని తెలుగులో దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు అల్లరినరేష్ కు ఇబ్బందికరంగా మారింది. ఈమధ్య తెలుగులో డబ్బింగ్ సినిమాలు బాగానే క్లిక్ అవుతున్నాయి. తాజాగా కాంతార ప్రభంజనాన్ని అందరం చూశాం.
ఆ రేంజ్ లో కాకపోయినా, ఓ మోస్తరుగా లవ్ టుడే క్లిక్ అయినా అల్లరి నరేష్ సినిమాకు కష్టాలు తప్పవు. ఎందుకంటే, లవ్ టుడే అనేది పూర్తిగా యూత్ మూవీ. క్లిక్ అయితే కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ఓ సీరియస్ సబ్జెక్ట్ తో వస్తోంది.
ఈ సినిమాతో పాటు తోడేలు అనే మరో హిందీ డబ్బింగ్ సినిమా కూడా అదే రోజున విడుదలవుతోంది. ఈ సినిమాను స్వయంగా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. ఇటు దిల్ రాజు, అటు అల్లు అరవింద్ లాంటి ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు, 2 డబ్బింగ్ సినిమాలతో థియేటర్లలోకి రావడం అల్లరి నరేష్ కు ఇబ్బందికరంగా మారింది.
నిజానికి ఈ రెండు డబ్బింగ్ సినిమాలు తప్పితే, మిగతా స్ట్రయిట్ మూవీస్ తో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దిల్ రాజు, అల్లు అరవింద్ సపోర్ట్ తో వస్తున్న ఈ 2 డబ్బింగ్ సినిమాల తాకిడిని తట్టుకుంటే, అల్లరోడు గట్టెక్కినట్టే.