చిరుకు బీజేపీ ప్ర‌శంస‌లు…ఏంది క‌థ‌?

మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ప్ర‌శంస‌ల వెనుక రాజ‌కీయ కోణం ఏదైనా వుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీ ముందు చూపున‌కు ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లే నిద‌ర్శ‌నం. చిరంజీవికి ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్…

మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ప్ర‌శంస‌ల వెనుక రాజ‌కీయ కోణం ఏదైనా వుందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీ ముందు చూపున‌కు ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లే నిద‌ర్శ‌నం. చిరంజీవికి ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ పుర‌స్కారం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

గోవాలో ఆదివారం ప్రారంభ‌మైన 53వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియ (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఇండియా ఫిలిం ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్‌-2022 అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేయ‌డం విశేషం. ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార‌శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు. అంతేకాదు, ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

ప్ర‌త్యేకించి చిరును బీజేపీ నేత‌లు అభినందించ‌డం వెనుక రాజ‌కీయ దూర దృష్టి ఏమైనా వుంద‌నే అభిప్రాయానికి దారి తీసింది. చిరును కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, అలాగే తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గ‌వ‌ర్న‌ర్లు ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. తాజాగా ప్ర‌ధాని మోదీ ఇంగ్లీష్‌, తెలుగు భాష‌ల్లో చిరంజీవికి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

‘చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే ఏపీలో నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు వ‌హించాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌లు కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ ప్ర‌తిపాద‌న‌ను చిరు సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు చెబుతున్నారు. తాజాగా రాజ‌కీయాల‌పై చిరు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయడం తెలిసిందే.

రాజ‌కీయాలకు త‌గిన మ‌న‌స్త‌త్వం త‌న‌ది కాద‌ని ఆయ‌న అన్నారు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ వైపు చిరంజీవి ఉన్నార‌నే సంకేతాలు ఇచ్చేందుకు ప్ర‌ధానితో కూడా ట్వీట్ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బీజేపీ నేత‌ల త‌ర‌హాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేత‌లెవ‌రూ ఆలోచించ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ విస్త‌రిస్తోందంటే… ఆ పార్టీ వ్యూహాలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చిరుపై ప్ర‌శంస‌లే నిద‌ర్శ‌నం.