జ‌గ‌న్ కూడా జోకులేస్తున్నారే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాట‌లు వింటే భ‌లే అమాయ‌కంగా ఉంటాయి. ఈయ‌న‌కు తెలిసేనా లేక తెలియ‌క మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు క‌లుగుతుంటాయి. స‌గం పాల‌న పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ఇంకా ఆయ‌న ఇసుక అంద‌రికీ అందించే…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాట‌లు వింటే భ‌లే అమాయ‌కంగా ఉంటాయి. ఈయ‌న‌కు తెలిసేనా లేక తెలియ‌క మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు క‌లుగుతుంటాయి. స‌గం పాల‌న పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ఇంకా ఆయ‌న ఇసుక అంద‌రికీ అందించే చ‌ర్య‌ల గురించి మాట్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామన్నారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని, బెల్టుషాపులను,పర్మిట్‌రూమ్‌ల తీసేశామని తెలిపారు. 

లిక్కర్‌ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయన్నారు. బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. కానీ మ‌ద్యం ఆదాయం ఎంత త‌గ్గింద‌నే విష‌యం మాత్రం ఆయ‌న చెప్ప‌క పోవ‌డం విశేషం.

ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి బాగా చెడ్డ‌పేరు తీసుకొచ్చిన అంశం ఏదైనా వుందా అంటే అది ఇసుక స‌ర‌ఫ‌రా. దీనిపై జ‌గ‌న్ మాట్లాడుతూ ఇసుక‌ను నిర్దేశించిన ధ‌ర‌ల క‌న్నా ఎక్కువ‌కు అమ్మితే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే మ‌రిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాల‌ని ఆదేశించారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలన్నారు. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలని సూచించారు.  

ఇదే స‌మావేశంలో ముఖ్య‌మంత్రి దృష్టికి ఇసుక అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి కీల‌క వివ‌రాలు వెళ్లాయి. ఇసుక అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి 12,211 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే 5,72,372 ట‌న్నుల ఇసుక స్వాధీనం, 16,365 వాహ‌నాల జ‌ప్తు, 22,769 మంది నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు సీఎం స‌మావేశంలో తెలిసొచ్చింది. అంటే ఇసుక అక్ర‌మ ర‌వాణా య‌థేచ్ఛ‌గా సాగుతున్న‌ట్టు ఈ గ‌ణాంకాలు చెబుతున్నాయి.

స‌రే న‌మోదైన కేసుల కంటే, త‌ప్పించుకున్న సంగ‌తేంట‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇసుక‌కు డిమాండ్ బాగా పెరిగింది. దీనికి కార‌ణాలేంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. లోప‌భూయిష్ట పాల‌సీతో సామాన్యుల‌కు ఇసుక అంద‌ని ద్రాక్ష అయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇంకా ఇసుక స‌క్ర‌మంగా అంద‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశిస్తుండ‌డం జోకు కాక… మ‌రేంట‌నే సెటైర్స్ నెటిజ‌న్స్ విసురుతున్నారు.