పడవ ప్రమాదం.. ఏసీ క్యాబినే ప్రాణాలు తీసిందా!

దేవీపట్నం బోటు ప్రమాదం తీరు గురించి అధికారిక వర్గాలు ఒక అంచనాకు వస్తున్నాయి. బోటు ప్రమాదంలో చాలామంది గల్లంతయ్యారు. వారి మృతదేహాలు కూడా ఇప్పటివరకూ దొరకలేదు. బోటుతో పాటు వారు కూడా పూర్తిగా మునిగిపోయి…

దేవీపట్నం బోటు ప్రమాదం తీరు గురించి అధికారిక వర్గాలు ఒక అంచనాకు వస్తున్నాయి. బోటు ప్రమాదంలో చాలామంది గల్లంతయ్యారు. వారి మృతదేహాలు కూడా ఇప్పటివరకూ దొరకలేదు. బోటుతో పాటు వారు కూడా పూర్తిగా మునిగిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సహాయక చర్యల్లో ఉన్న అధికారులు బోటు దాదాపు మూడు వందల పదిహేను అడుగుల లోతులో ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. అది ఎక్కడ ఉందో ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. గోదావరిలో నీరు భారీ స్థాయిలో ఉండటంతో బోటును గుర్తించడం, బయటకు తీయడం అంత సులభంగా జరగడం లేదని తెలుస్తోంది.

ప్రమాదంలో అంతమంది గల్లంతు కావడానికి ఏసీ క్యాబిన్ ప్రయాణం కూడా ఒక కారణమని తెలుస్తోంది. బోటులో ఏసీ క్యాబిన్ ఉందట. అంతులో కూర్చుని.. అద్దాల ఆవల గోదావరి అందాలను తిలకించే ఆసక్తితో చాలామంది అందులోకి వెళ్లారని తెలుస్తోంది. ఏసీ క్యాబిన్ అంటే దానికి దాదాపుగా అద్దాలు ఉంటాయి, అలాగే డోర్స్ క్లోజ్ అవుతాయి. దీంతో.. పడవ మునిగిపోతున్నా చాలామంది బయటపడలేకపోయారని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు.

ఏసీ క్యాబిన్ బయట ఉన్న వారిలో, లైఫ్ జాకెట్లు వేసుకున్న వారు.. ఈత తెలిసిన వారు కొంతమంది బయటపడగలిగారు. అదే ఏసీ క్యాబిన్లో ఉన్నవారు మాత్రం.. లోపలే చిక్కుకున్నారు. నీరు చుట్టుకోవడంతో తలుపులు తెరవడానికి ప్రయత్నించినా.. అది సాధ్యంకాకపోయి ఉండవచ్చు.

దీంతో వారంతా క్యాబిన్లోనే జలసమాధి అయి ఉంటారని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న వారు మీడియాతో విశ్లేషిస్తున్నారు. బోటును బయటకు తీస్తే కానీ.. గల్లంతయిన వారి విషయంలో స్పష్టత రాదని అంటున్నారు. ఏసీ క్యాబిన్ ప్రయాణమే పెను ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ