ఒక నాయకుడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నాడంటే… అతనిలో సానుకూలతను ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రత్యర్థి పార్టీ నాయకుల నుంచి మంచిని గ్రహించడం, చెడును త్యజించిన వాళ్లకే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.
తెలుగు సమాజంలో చంద్రబాబు అత్యంత సీనియర్ నాయకుడు. తాజాగా బడుల ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు చూపిన చొరవను ప్రతి రాజకీయ నాయకుడు జాగ్రత్తగా గమనించాలి. అందులోని మంచి గ్రహించాల్సిన అవసరం ఉంది.
చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని ఓ పాఠశాల ఎన్నికపై ఆయన స్పందించిన తీరు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. శాంతిపురం మండలంలోని తుమ్మిసి ఆదర్శ పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవి కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ నువ్వానేనా అంటూ తలపడ్డాయి. 15 మంది కమిటీ సభ్యుల స్థానాల్లో 11 టీడీపీ మద్దతు దారులు, 4 వైసీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఈ 11 మంది తుమ్మిసికి చెందిన మంజునాథ్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో ఈ ఎన్నికపై రగడ మొదలైంది. పోలీసులు రంగంలోకి దిగారు.
తాము ఎన్నికైనట్టు డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని టీడీపీ మద్దతుదారులు కోరగా అధికారులు నిరాకరించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై తమను ఇబ్బంది పెడుతుండడంపై తమ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి టీడీపీ మద్దతుదారులు తీసుకెళ్లారు. వెంటనే చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఒక లేఖను కలెక్టర్‌కు పంపారు.
తమ అనుకూలురు సభ్యులుగా ఎన్నిక కాకపోవడంతో వైసీపీ నేతలు జోక్యం చేసుకుని కమిటీని ప్రకటించకుండా అధికారులను ప్రభావితం చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక్క పాఠశాల వద్దే 50 మంది పోలీసులను మోహరింపజేశారన్నారు. ఎన్నికైన సభ్యులు ఫలితాల కోసం పాఠశాలలో వేచి ఉన్నారన్నారు. వెంటనే జోక్యం చేసుకుని పాఠశాల నిర్వహణ కమిటీని ప్రకటించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు.
ఇన్చార్జి ప్రిన్సిపాల్ మణి అక్కడికి చేరుకుని టెన్త్‌క్లాస్‌కు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు 45 శాతమే హాజరైన కారణంగా ఎన్నికను రద్దు చేస్తున్నట్టు చావు కబురు చల్లగా ప్రకటించారు. గురువారం తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఆందోళన విరమించారు. ఇదే పులివెందులలో వైసీపీ నేతలు ఏదైనా కష్టమొస్తే అధినేతకు చెప్ప గలిగే పరిస్థితి ఉందా? ఆశ దోశె అప్పడం వడ అని అంటారా?