ఈ నెల 24, 25 వ తేదీల్లో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీ వ్యాప్తంగా. మరి ఇప్పుడు టీడీపీ వీటిని బహిష్కరించగలదా? ప్రజలు ఓటేసే ఎన్నికల విషయంలోనేమో, తీరా నామినేషన్లను వేశాకా.. ఎన్నికలను బహిష్కరించారు!
ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలోనేమో.. ఎక్కడైనా పొరపాటున గెలిస్తే అది టీడీపీ విజయంగా, ఓడిన చోటల్లా బహిష్కరణగా టీవీల్లో వేసుకున్నారు! మరి ఇప్పుడు ఎక్కడైనా తమకు ఎంపీపీ సీట్లు దక్కే అవకాశం ఉంటే, కనీసం పోటీ ఇచ్చే అవకాశం ఉంటే.. టీడీపీ దాన్ని వదులుకుంటుందా? ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎంపీపీ సీట్లు ఏవైనా దక్కితే వాటిని త్యాగం చేసి బహిష్కరించుకున్నట్టుగా వ్యవహరిస్తుందా?
పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన షాకింగ్ రిజల్ట్స్ వల్ల మాత్రమే టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిందనేది నిఖార్సైన నిజం. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. నామినేషన్లు దాఖలైపోయాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.
సీరియస్ పాలిటిక్స్ చేసే వాళ్లెవ్వరూ అలాంటి పని చేయరు! అయితే.. 23 సీట్లకు పరిమితమైన ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఒక నాన్ సీరియస్ పొలిటిషియన్ అయిపోయారు. ఆయన రాజకీయం చేస్తున్న అంశాలు కూడా అలానే ఉన్నాయి. ఆయన రాజకీయ అడుగులూ అలానే ఉన్నాయి.
ఇక చంద్రబాబు నాయుడు డొల్ల రాజకీయాలకు తోడు పచ్చమీడియా కామెడీ తోడయ్యింది. గెలిచిన చోటేమో గెలిచినట్టు అట, ఓడిన చోటేమో బహిష్కరించినట్టు అట! ఏపీ ప్రజలు పచ్చమీడియా దృష్టిలో ఎంత అమాయకులు, వెర్రివాళ్లు అయ్యారో ఈ వితాండ వాదాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.
మరి రేపు ఎంపీపీ ఎన్నికలు జరిగినప్పుడు ఇంకెలాంటి కామెడీ చేస్తారో. ఎలాగూ జడ్పీ పీఠాలను సొంతం చేసుకునేంత బలం టీడీపీ ఎక్కడా లేదు. ఎంపీపీల్లో కూడా అంత సీన్ లేకపోవచ్చు. మరి ఎలాగూ పీఠాలు దక్కవు కాబట్టి.. గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. మరోసారి ఈ ఎన్నికలను బహిష్కరించి, కామెడీని చేయబోతున్నారేమో!