మార్గదర్శి పరిరక్షణకు ఈనాడు కుట్రలు!

వారి వ్యాపారాలకు అసలు ఆయువుపట్టు మార్గదర్శి. అక్కడ యధేచ్ఛగా అడ్డదారులు తొక్కుతూ.. ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తూ.. రామోజీ గ్రూపు చెలరేగిపోతూ ఉంటుంది. మార్గదర్శి మీద ఈగ వాలినా కూడా వారికి ఇబ్బందే. అలాంటిది ఇప్పుడు…

వారి వ్యాపారాలకు అసలు ఆయువుపట్టు మార్గదర్శి. అక్కడ యధేచ్ఛగా అడ్డదారులు తొక్కుతూ.. ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తూ.. రామోజీ గ్రూపు చెలరేగిపోతూ ఉంటుంది. మార్గదర్శి మీద ఈగ వాలినా కూడా వారికి ఇబ్బందే. అలాంటిది ఇప్పుడు మార్గదర్శి వ్యాపారంలో ఏ రకమైన అక్రమాలు అవకతవకలకు పాల్పడుతున్నారనే విషయాలను నిర్ధారించడానికి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తుంటే.. దానికి సంబంధించి వక్ర పూరితమైన ప్రచారాలు చేయడానికి ఈనాడు సాహసిస్తుంది.

తమ చేతిలో బలమైన మీడియా సంస్థ ఉన్నది కనుక.. తమ అక్రమాల సంస్థ గురించి వక్ర ప్రచారాలు చేసుకోవచ్చు అని వారు ఊహిస్తున్నట్లుగా ఉంది. మార్గదర్శి సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు తాము గమనించిన  అంశాలను నోట్ చేసి దానిపై సంతకం చేయాల్సిందిగా స్థానిక మేనేజర్లను కోరడం కూడా తప్పే అన్నట్లుగా ఈనాడు ప్రచారం చేయడం, ఆ అక్రమాలకు దన్నుగా నిలవడం గమనార్హం! ఈనాడు ప్రచురించిన వార్తలోనే వారెంత దుర్బుద్ధితో ఇలాంటి ప్రచారానికి తెగబడుతున్నారో స్పష్టంగా అర్థం అయిపోతుంది.

ఆంధ్రప్రదేశ్లోని మార్గదర్శి చిట్ ఫండ్ 17 కార్యాలయాలలో ప్రస్తుతం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమ పరిశీలనలో ఏ మేరకు చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని గమనించారో.. ఆ విషయాలను కాగితం మీద రాసి సంతకం చేయమన్నప్పుడు స్థానిక మేనేజర్లు నిరాకరిస్తున్నారు!

సహజంగా మార్గదర్శి మేనేజర్లకు ఈనాడు దన్ను ఉంటుందనేది సత్యం. దానికి తగ్గట్టుగానే ఈ వ్యవహారం పై ఈనాడు వక్రపూరితమైన కథనాలను ప్రచురిస్తోంది. ప్రశ్నలు జవాబులు కూడా అధికారులే రాసి సిద్ధం చేసి.. వాటి మీద సంతకం చేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఈనాడు ఒక సుదీర్ఘమైన కథనాన్ని ప్రచురించింది.

విశాఖపట్నం, గుంటూరు, తదితర ప్రాంతాల్లో అధికారులు ఈ మేరకు మార్గదర్శి మేనేజర్లపై ఒత్తిడి చేస్తున్నారనేది వార్తలోని సారాంశం. సంతకాలకు నిరాకరించినందుకు తమ మేనేజర్లను బెదిరిస్తున్నారని, సెకండ్ వే లో వెళతామంటూ హెచ్చరిస్తున్నారని ఆ వార్తలో పేర్కొన్నారు. ఈ బెదిరింపులు అన్నీ నిజమే అని భ్రమింపచేసేలా వార్తలు వండుకుంటూ వచ్చారు. సివిల్ వివాదాలను క్రిమినల్ వివాదాలుగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మార్గదర్శి ఆరోపిస్తోంది. అంటే సివిల్ తప్పిదాలు ఉన్నట్లుగా అన్యాపదేశంగా ఒప్పుకుంటూనే ఉంది.

కానీ అదే వార్తలో.. కడప విషయంలో మాత్రం ఈనాడు వక్రబుద్ధి బయటపడుతోంది. కడపలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రాఘవన్ ఎక్కువ హడావుడి చేశారంటూ ఆయనపై పెద్ద నిందలు వేశారు. 'సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు' అని రాసిన ఈనాడు… మిగిలిన చోట్ల మాదిరిగా ఎలా బెదిరించారనే సంగతి రాయలేదు.

ఈనాడు ఎలాంటి వక్ర ప్రచారాలకు పాల్పడుతుందో అవగాహన ముందే ఉన్నట్లుగా.. సీఐ రాఘవన్ మార్గదర్శి కార్యాలయంలో వ్యవహారాన్ని వీడియో తీశారు. ఆయన చేయని బెదిరింపులను.. ఆయనకు ఆపాదించి వక్ర ప్రచారం చేస్తే వీడియో సాక్ష్యం ఈనాడు బుద్ధిని బయట పెడుతుంది. అందుకే ఈనాడు కడప విషయంలో ఎక్కువ బెదిరింపుల సంగతి రాయకుండా జాగ్రత్త పడింది. మిగిలిన చోట్ల సెకండ్ వేలో వెళతామని రకరకాలుగా బెదిరించారంటూ అవాకులు, చవాకులు రాసింది. చేతిలో మీడియా సంస్థ ఉన్నది కదా అని.. తమ సొంత అక్రమ వ్యాపారాన్ని అడ్డగోలుగా సమర్ధించుకునే ఇలాంటి దుర్బుద్ధులను ఏమనాలి?

గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి డిపాజిట్లపై కేసు వేసినప్పుడు కూడా ఈనాడు అన్ని ఇలాంటి వక్రపూరిత ప్రచారాలకే పాల్పడింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాన్ని నిర్వహించింది మార్గదర్శి సంస్థ. ఆ ఆరోపణకు సమాధానం చెప్పకుండా.. డిపాజిట్లు ఎవరినీ తాము మోసం చేయలేదని, అందరికీ వారి వారి డబ్బు తిరిగి ఇచ్చాం అని.. రకరకాల బుకాయిపు మాటలు మాట్లాడారు. చట్టంలో లొసుగులను వాడుకొని అక్రమ దందా సాగించారా లేదా అనే దానికి ఇప్పటికీ వారి నుంచి జవాబు లేదు. 

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తుంటే అదే తరహా వక్ర ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదో వేధింపుల వ్యవహారం అన్నట్లుగా ప్రజలలో అభిప్రాయం సృష్టించడానికి ఈనాడు విఫలయత్నం చేస్తుంది. వీరి అక్రమ వ్యాపారాలు తనిఖీలు వ్యవహారాన్ని కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ముడి పెట్టడానికి జరుగుతున్న కుట్రలాగా ఇది కనిపిస్తోంది.