2019లో టీడీపీ చారిత్రక ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అయినా పార్టీ అధిష్టానం, నేతల పద్ధతి మారిందా అంటే, లేదు. వైసీపీపై విమర్శలు చేయడానికి వారం రోజులు కూడా ఆగలేకపోయారు. నెలకో పథకాన్ని అమలు చేసుకుంటూ.. ఏడాది పాలనలో నవరత్నాలన్నీ దాదాపుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు సీఎం జగన్. ఇక్కడే చంద్రబాబు అండ్ కో తమ చావు తెలివితేటల్ని ప్రదర్శిస్తోంది. అమలులోకి వచ్చిన పథకాలన్నిటినీ ఒకే గాటన కట్టి అసలు నవరత్నాలే పెద్ద డూప్లికేట్ అని విమర్శిస్తోంది.
పోనీ నవరత్నాలు ఫ్లాప్ షో అనుకుందాం. టీడీపీ విమర్శలనే కాసేపు నమ్ముదాం. మరి 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే నవరత్నాలను ఆపేస్తాం అని ఆ పార్టీ స్టేట్ మెంట్ ఇవ్వగలదా? నవరత్నాల వల్ల ప్రజాధనం వృథా అయితే, సొమ్మంతా పెద్దల జేబుల్లోకే వెళ్లే పరిస్థితి ఉంటే.. టీడీపీ కచ్చితంగా వాటిని ఆపేస్తామంటూ ఎన్నికల హామీ ఇవ్వాల్సిందే. చంద్రబాబు దాటవేసినా, వైసీపీ కచ్చితంగా ఆ డిమాండ్ చేస్తుంది.
సో.. వచ్చే ఎన్నికలనాటికి జగన్ ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు, చంద్రబాబే తనకుతానుగా పెద్ద గొయ్యి తయారు చేసుకుంటున్నారు. ఒక్కో పథకంలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, అంతమాత్రాన అసలా పథకమే తప్పు అని విమర్శించలేం కదా. సరిగ్గా చంద్రబాబు ఇక్కడే దిద్దుకోలేని తప్పు చేస్తున్నారు.
నవరత్నాల పథకాలపై విషం చిమ్ముతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే కోలుకోలేని దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే కోర్టుల్ని అడ్డం పెట్టుకుని అడ్డు తగులుతున్నారు. హౌస్ ఫర్ ఆల్ లో అరకొరగా మిగిలిపోయిన నాసిరకం ఇళ్లను లబ్ధిదారులకు అందించాలంటూ వితండవాదం చేస్తున్నారు. నాసిరకం ఇళ్ల కంటే, జానెడు ఇంటి స్థలమే ఎవరికైనా ముఖ్యం. ప్రజలంతా ఇప్పుడదే కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన ఇళ్ల కంటే, జగన్ ఇచ్చే ఇంటి స్థలాలే గొప్పవని జనం నమ్మారు, వాటి కోసమే వేచి చూస్తున్నారు.
ఇదొక్కటే కాదు.. నవరత్నాల పథకాలన్నింటినీ జనం గుండెల్లో పెట్టుకున్నారు. పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారంటూ టీడీపీ విద్వేష ప్రకటనలిస్తున్నా జనం నమ్మడం లేదు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గ్రహించాలి. ప్రజలు వేటిని ఇష్టపడుతున్నారు, వేటితో సుఖంగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తించలేకపోతే వచ్చే ఎన్నికలనాటికి విమర్శలు తప్ప చంద్రబాబుకి చెప్పుకోడానికి ఏమీ ఉండదు. నవరత్నాలను టచ్ చేసినా, చేయాలనుకున్నా.. చంద్రబాబుకి మరింత దారుణ పరాభవం ఖాయం.