అమరావతి అంటూ అరచేతిలో స్వర్గం చూపించి, భ్రమరావతి గ్రాఫిక్స్ తో మోసం చేసిన చంద్రబాబు రైతులతో పాటు ఎంతోమందిని రోడ్డున పడేశాడు. వాటి ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే రైతులు రోడ్డున పడగా.. తాజాగా ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది ఎన్నారైలు కూడా బలిపశువులయ్యారు.
అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి ఓ ఎన్నారై, బాబు హయాంలో (బాబు ప్రోద్బలంతో కూడా అనుకోవచ్చు) అక్కడి రైతుల నుంచి ఎకరాకు 15 లక్షల నుంచి 40 లక్షల వరకు చెల్లించి భూములు కొన్నాడు. ఆ భూమిని ఆ ప్రాంతానికి చెందిన మరికొంతమంది ఎన్నారైలకు 40 లక్షల నుంచి 2 కోట్ల వరకు అమ్మేశాడు. వీళ్లలో కొందరు అప్పట్లోనే భూముల్ని అమ్ముకోగా.. మిగతా వాళ్లు మాత్రం ఇప్పుడు బుక్కయ్యారు.
ప్రభుత్వం మారడంతో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇక అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని కాదని తెలిసిన తర్వాత ఆ భూముల రేట్లు అమాంతం పడిపోయాయి. దీంతో భూములు కొన్న వాళ్లంతా సదరు ఎన్నారైపై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు ఎలాగైనా అమరావతిలోనే క్యాపిటల్ ఉండేలా చేస్తారని సదరు ఎన్నారై మొన్నటివరకు నమ్మబలికాడు. కానీ మండలిలో జరిగిన తతంగంతో విషయం మొత్తం అందరికీ అర్థమైపోయింది. దీనికి తోడు విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు వడివడిగా పడుతున్న నేపథ్యంలో సదరు ఎన్నారైలంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
వీళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే.. తమకు భూములు అమ్మిన వ్యక్తిపై కేసు కూడా పెట్టలేరు. ఎందుకంటే బూమ్ లో ఇష్టపూర్వకంగా భూములు కొన్నారు వీళ్లంతా. ఇప్పుడు రేట్లు తగ్గితే అది అతడి తప్పెలా అవుతుంది. అలా విదేశాల్లో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి, అత్యాశకు పోయి అమరావతిలో మొత్తం సమర్పించుకున్నారు కొంతమంది ఎన్నారైలు.
ప్రస్తుతం అమరావతి చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉందంటే.. భూముల ధరలన్నీ పదేళ్ల కనిష్ట స్థాయికి దిగజారాయని స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులే చెబుతున్నారు. భూముల ధరలతో పాటు అపార్ట్ మెంట్ రేట్లు భారీగా తగ్గాయి. మొన్నటివరకు ఆకాశంలో ఉన్న అపార్ట్ మెంట్ ధరలు, ఇప్పుడు మధ్యతరగతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చాయి. ఒకటి మాత్రం నిజం.. భూమిపై పెట్టుబడులు ఎప్పుడూ నిరర్థకం అనిపించుకోవు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాతైనా లాభాలు గ్యారెంటీ. అయితే “భ్రమరావతి బూమ్”లో కోట్లు పెట్టి భూములు కొన్నవాళ్లు మాత్రం దరిదాపుల్లో రికవరీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు రాజధాని రైతులకు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవ రూపం కళ్లకు కనిపిస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ ముసుగులో కొంతమంది ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. 90శాతం రైతులు మాత్రం మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టారు. రాయపూడి, బోరుపాలెం, మంగళగిరి, పెనుమాక, ఎర్రబాలెం లాంటి ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలా కొంతమంది ఎన్నారైలతో పాటు రైతులు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారు.