కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేసిన రీతిలో రాజస్తాన్ లో కూడా బీజేపీ తన గేమ్ ను అమలు పరుస్తోందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. సచిన్ పైలట్ వంటి అసంతృప్త వాదిని అడ్డం పెట్టుకుని బీజేపీ తన కార్యాన్ని పూర్తి చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాజస్తాన్ లో బీజేపీకి అంత ఈజీగా కనిపించడం లేదు. ఫిరాయింపు రాజకీయాలతో బండిని లాగించే అవకాశం ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ కొంత బలంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అంత ఈజీ కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుత బలాబలాల విషయానికి వస్తే.. కాంగ్రెస్ కూటమి వైపున 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ కూటమిలో 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం నిలబడాలంటే మినిమం మెజారిటీ 101 మంది ఎమ్మెల్యేల బలం. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ఆధ్వర్యంలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఫిరాయిస్తేనే.. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. సచిన్ వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అతడి వర్గాలు మీడియాకు లీకులు ఇస్తున్నాయి. అయితే అది నిజంగా నిజమేనా? అనేది బలపరీక్ష జరిగేంత వరకూ తేలే అంశం కాదు!
అందునా.. వృద్ధుడే అయినప్పటికీ, అశోక్ గెహ్లాట్ కు రాజకీయంగా చాణక్యం ఉందని అంటున్నారు. మరీ కమల్ నాథ్ లా చేతులెత్తేయడని, పోరాడగలడనే టాక్ వినిపిస్తూ ఉంది. మధ్యప్రదేశ్ లో అయినా, కర్ణాటకలో అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికీ – బీజేపీకి మధ్య సీట్ల వ్యత్యాసం తక్కువ. దాదాపు 18 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుతో కర్ణాటకలో బీజేపీ చేతికి అధికారం దక్కింది. మధ్యప్రదేశ్ లో అయితే ఇరు పార్టీల మధ్యన సీట్ల తేడా మరింత తక్కువ. దీంతో అక్కడ కూడా పని తేలికగా జరిగింది. రాజస్తాన్ లో 30 మంది ఎమ్మెల్యేలు అవసరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ అక్కడ రచ్చ రేపి ఫిరాయింపులతో బండి నెట్టుకురాగలగడం తేలిక కాదు.
గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. మధ్యప్రదేశ్ లో తిరుగుబాటు దారు సిందియా ఈజీగా బీజేపీ షరతులకు తలొగ్గాడు. బీజేపీ అభ్యర్థికే సీఎం సీటును అప్పగించాడు. రాజస్తాన్ లో ఆల్రెడీ సచిన్ పైలట్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఈ క్రమంలో తిరుగుబాటు ద్వారా అతడు సీఎం సీటును ఆశించవచ్చు. అలాంటి పక్షంలో బీజేపీలోని నేతలు అతడికి ఏ మేరకు సహకరిస్తారు? పైలట్ ను సీట్లో కూర్చోబెట్టి వసుంధర రాజే వర్గం సపోర్ట్ చేస్తుందా? అలాంటి రాజీ ఉండకపోవచ్చు. అంతిమంగా.. రాజకీయ అనిశ్చితి అని బీజేపీ వాళ్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించేసినా విధించవచ్చు. అప్పుడు పైలట్ కు మిగిలేది మాజీ ఉపముఖ్యమంత్రి హోదా మాత్రమేనేమో!