ఒకవైపు తాలిబన్లతో భుజం కలుపుతూ పాకిస్తాన్ వెకిలి నవ్వులు నవ్వుతోంది. బక్క చిక్కిన కుక్కకు కుళ్లిన ఎముక దొరికినట్టుగా.. పాకిస్తాన్ కు ఆఫ్గానిస్తాన్ దొరికినట్టుగా ఉంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఛీత్కారాలను పక్కన పెట్టి తాలిబన్లతో చేతులు కలిపింది పాక్. తద్వారా తన బుద్ధి మారదని అంతర్జాతీయ సమాజానికి క్లారిటీ ఇచ్చింది.
ఆఫ్గాన్ లో తాలిబన్ల ఎంట్రీతో పాక్ మరింత ప్రమాదకరంగా మారింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటోంది. అందుకే పాక్ లో క్రికెట్ టూర్ ను ప్లాన్ చేసుకున్న ఇతర దేశాలు వాటిని అర్ధాంతరంగా రద్దు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే పాకిస్తాన్ కు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు తిరుగుముఖం పట్టింది. ప్రస్తుతం పాక్ లో పరిస్థితులు సవ్యంగా లేవని, భద్రతా కారణాలను చూపి న్యూజిలాండ్ ఇంటి దారి పట్టింది. దీంతో పాక్ కు గట్టి షాక్ తగిలింది. వాస్తవానికి 2008 నుంచి విదేశీ జట్లేవీ పాక్ లో పర్యటించడం లేదు. అప్పట్లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో.. అప్పటి నుంచి పాక్ ను అంతర్జాతీయ క్రికెట్ సమాజం దూరం పెట్టింది.
అయితే ఈ మధ్యనే కొంతమంది ఆటగాళ్లు, జట్లు పాక్ వైపు వెళ్తున్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆమధ్య పాక్ కు వెళ్లి భద్రత విషయంలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా తమ దేశం ఆడి వెళ్లడానికి సురక్షితం అని పాక్ చాటుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు అక్కడ అడుగుపెట్టింది. అయితే.. ఇంతలోనే ఆఫ్గాన్ పరిణామాలే భయపెట్టాయో ఏమో కానీ తమ జట్టును వెనక్కు పిలిపించుకుంది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఈ పరిణామంపై పాక్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కివీస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే తమ ఇల్లు సరిగా సర్దుకోలేక వేరే వాళ్లపై మండి పడటం ఏమిటో వారికే తెలియాలి. న్యూజిలాండ్ కు తోడు.. ఇంగ్లండ్ కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంది. త్వరలోనే పాకిస్తాన్ తో పాకిస్తాన్ లో సీరిస్ లను ప్లాన్ చేసింది ఇంగ్లండ్. అయితే న్యూజిలాండ్ తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంతో ఇంగ్లండ్ కూడా స్పందించింది. తమ జట్లు కూడా పాక్ వెళ్లవని స్పష్టం చేసింది ఈసీబీ. దీంతో పాకిస్తాన్ కు పుండు మీద కారం జల్లినట్టుగా అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ దయతో ఇటీవలే రమీజ్ రాజా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన తన భాషా ప్రావీణ్యాన్ని అంతా చూపిస్తూ.. ప్రపంచ క్రికెట్ మీద ప్రతీకారం తీర్చుకుంటామంటున్నాడు.
ఈ అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసు అంటున్నాడు. ఈ బాధను పాక్ క్రికెట్ ప్రతిభను పెంపొందించుకునే విషయంలో చూపిస్తుందంటున్నాడు! ఇలా ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నాడు రమీజ్ రాజా. అయినా.. ఉగ్రవాదులతోనూ, మతమౌడ్యులతో భాయీభాయీ అంటూ, తమ దేశంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలీని దశలో ఉన్న పాక్ కు ఇలా పరాయి దేశాల మీద ఆడిపోసుకోవడానికి అర్హత ఏముందో మరి. దుబాయ్ కు వెళ్లి అదే తమ దేశం అన్నట్టుగా విదేశాలతో మ్యాచ్ లను ఆడటం తప్ప మరో ఛాయిస్ లేకపోయినా.. ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు!