ఇక మీడియా మీద దాడి కాదు!

వైఎస్ హయాంలో మార్గదర్శి సంస్థ లో సోదాలు చేసినా, కేసులు నమోదు చేసినా దాన్ని మీడియా మీద దాడిగా వార్తలు వండి వార్చేవారు. వివిధ పార్టీల నాయకుల చేత ఆ మేరకు ప్రకటనలు ఇప్పించేవారు.…

వైఎస్ హయాంలో మార్గదర్శి సంస్థ లో సోదాలు చేసినా, కేసులు నమోదు చేసినా దాన్ని మీడియా మీద దాడిగా వార్తలు వండి వార్చేవారు. వివిధ పార్టీల నాయకుల చేత ఆ మేరకు ప్రకటనలు ఇప్పించేవారు. అంతే తప్ప, నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరణ చేయకపోతే ఎందుకు ఒకేసారి వేల కోట్లు సమీకరించి వాటిని వెనుక్కు ఇచ్చారన్న లాజిక్ పాయింట్ ను పట్టించుకోలేదు. సరే…అదంతా గతం. ఆ కేసు అలా మరుగున పడింది. ఇటీవల మళ్లీ అసలు పిటిషన్ దారు ఉండవల్లి పట్టిన పట్టు విడవకుండా దాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మార్గదర్శి సంస్థల్లో రాష్ట్ర రిజ‌స్ట్రార్ శాఖ తనిఖీలు నిర్వహించింది. మార్గదర్శితో పాటు మరి కొన్ని చిట్ ఫండ్ సంస్థల మీద కూడా ఈ సోదాల కార్యక్రమం జ‌రిగింది. సరే, ఈ వార్తలకు ఈనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అది వేరే సంగతి. కానీ ఒకవేళ ఈ సోదాల పర్యవసానం ఎటొచ్చి, ఎటు వెళ్లినా, ఈసారి కూడా దాన్ని మీడియా మీద దాడి అని అనే అవకాశం వుంటుందా? అని ప్రశ్నించుకుంటే కచ్చితంగా వుండదనే చెప్పాలి.

ఎందుకంటే ఈనాడు అధినేత రామోజీరావు మీడియాను మించి అనే స్టేజ్ లో వున్నారు. తరచు చంద్రబాబు వెళ్లి కలుస్తున్నారు. దేశంలోనే పవర్ ఫుల్ నేతల్లో ఒకరైన అమిత్ షా వెళ్లి కలిసారు. రామోజీ కుటుంబ సభ్యులు వెళ్లి మోడీని కలిసి వచ్చారు. ఇవన్నీ ఒకవైపు.

వైకాపా ప్రభుత్వం పట్ల ఈనాడు చాలా కఠినంగా వ్యవహరిస్తోందన్నది నిత్యం ఈనాడు చదివితే అర్థం అవుతుంది. జ‌గన్ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు కానివ్వకూడదు అనేంత పట్టుదల ఈనాడు వార్తల్లో కనిపిస్తూ వుంటుంది. ఇలా ప్రభుత్వంతో ఫైటింగ్ స్పిరిట్ తో ముందుకు వెళ్తున్నపుడు, అదే సమయంలో చంద్రబాబు తరచు రామోజీని కలిసి చర్చలు సాగిస్తున్నపుడు, కేవలం మీడియా అధినేత మాత్రమే ఎలా అవుతారు..అంతకు మించి అనుకోవాల్సిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రభావిత వ్యక్తిగా రామోజీ వున్నారు.అందులో సందేహం లేదు. ఉద్యమకాలంలో రామోజీ మీద ధ్వజ‌మెత్తిన సిఎమ్ కేసిఆర్ కూడా ఆ తరువాత మెత్తబడ్డారు. స్వయంగా వెళ్లి రామోజీని కలిసి వచ్చారు. జ‌గన్ కూడా ఓసారి అలాగే వెళ్లి కలిసి వచ్చారు. కానీ జ‌గన్ పట్ల రామోజీ వైఖరి మారకపోవడంతో ఇక బాహాటంగా ధ్వజ‌మెత్తడం మొదలుపెట్టారు. వైకాపా నాయకులు అంతా అదే వైఖరితో వున్నారు.

అందువల్ల ఇప్పటికే ఎప్పుడో రామోజీకి వైకాపాకు మధ్య యుద్దం నడుస్తోంది. ఇది రామోజీ తన మీడియాను వైకాపాకు వ్యతిరేకంగా మోహరించిన నేపథ్యంలో జ‌రుగుతున్న యుద్దం. ఇక్కడ రామోజీ ఆయుధం తన మీడియా. వైకాపా ఆయుధం తన అధికారం. అందువల్ల ఈ యుద్దాన్ని మీడియా మీద దాడిగా ఇక ఎంత మాత్రం చూడాల్సిన అవసరం అయితే లేదు.