పెద్దాయ‌న‌కు ఏ గ‌తి ప‌ట్టింద‌య్యా!

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిని పార్టీల‌కు అతీతంతా అంతా పెద్దాయ‌న‌గా పిలుస్తారు. ఐదు ద‌ఫాలు ఆయ‌న ఎమ్మెల్యేగా గెలుపొందారు. శిష్యుల చేతిలోనే ఆయ‌న రెండు ద‌ఫాలు ఓట‌మి పాల‌య్యారు. 2019లో…

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డిని పార్టీల‌కు అతీతంతా అంతా పెద్దాయ‌న‌గా పిలుస్తారు. ఐదు ద‌ఫాలు ఆయ‌న ఎమ్మెల్యేగా గెలుపొందారు. శిష్యుల చేతిలోనే ఆయ‌న రెండు ద‌ఫాలు ఓట‌మి పాల‌య్యారు. 2019లో టీడీపీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీకి దూర‌మ‌య్యారు. మూడున్న‌రేళ్ల పాటు రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న టీడీపీలో యాక్టీవ్ అయ్యారు.

గ‌తంలో టీడీపీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మ‌ళ్లీ వ‌స్తున్నావ‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. తెలుగుదేశంలో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఉన్న‌ట్టు త‌మ‌కు అధిష్టానం నుంచి స‌మాచారం లేద‌ని ఆ పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్య‌క్షుడు మ‌ల్లెల లింగారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇటీవ‌ల సొంత ఎజెండాతో ఫారెస్ట్‌, స‌బ్ రిజిస్ట్రార్‌, పోలీస్ కార్యాల‌యాల‌కు వెళ్లి అధికారుల‌ను ఇష్టానుసారం మాట్లాడార‌ని, వాటితో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి అధికారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం స‌రైంది కాద‌ని త‌ప్పు ప‌ట్టారు. పార్టీ అధికారంలో లేన‌ప్పుడు దూరంగా వుండి, ఇప్పుడు టికెట్ త‌న‌కే అని ప్ర‌చారం చేసుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.

ఇలా ప్రొద్దుటూరు టికెట్ విష‌య‌మై ఎవ‌రికి వారు త‌మ‌దిగా ప్ర‌క‌టించుకోవ‌డం వ‌ల్ల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో అయోమయం నెల‌కుంద‌న్నారు. ప్రొద్దుటూరు టీడీపీలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. త‌మ‌కు టికెట్ రాక‌పోయినా ప‌ర్వాలేదు, గిట్ట‌ని నేత‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో ఇవ్వ‌కూడ‌ద‌నే భావ‌న క‌నిపిస్తోంది. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా ప‌ని చేసిన వ‌రంద‌రాజుల‌రెడ్డి, రాజ‌కీయ చ‌ర‌మాంకంలో శిష్యుల‌తో చీవాట్లు తినాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పార్టీకి దూర‌మ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌, సిగ్గు లేకుండా త‌న‌కు తానుగా ఎలా వ‌స్తార‌ని ప్రొద్దుటూరు టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత కాలం ఎంతో గౌర‌వంగా బ‌తికిన వ‌రద‌రాజుల‌రెడ్డికి ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. నిల‌క‌డ‌లేని రాజ‌కీయాల‌తో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఎటూ చెల్ల‌కుండా పోతున్నార‌నే ఆవేద‌న ఆయ‌న అనుచ‌రుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రొద్దుటూరు టీడీపీలో ఎవ‌రికి వారే హీరోలమ‌ని అనుకోవ‌డం వ‌ల్లే పార్టీ బ‌ల‌హీన‌మైంది.