హీరోయిన్ కు జైలు త‌ప్పింది!

ఒక‌వైపు ప్రియుడు జైలు పాలు కావ‌డం, ఆ పై త‌న ఆస్తులు భారీ ఎత్తున ఈడీ అటాచ్ మెంట్, ఇంకా పాస్ పోర్ట్ సీజ్.. వంటి వాటితో ఇబ్బంది ప‌డుతున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్…

ఒక‌వైపు ప్రియుడు జైలు పాలు కావ‌డం, ఆ పై త‌న ఆస్తులు భారీ ఎత్తున ఈడీ అటాచ్ మెంట్, ఇంకా పాస్ పోర్ట్ సీజ్.. వంటి వాటితో ఇబ్బంది ప‌డుతున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు తాత్కాలిక ఊర‌ట ల‌భించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జైలు కెళ్లే గ‌తి త‌ప్ప‌డం ఆమెకు పెద్ద ఊర‌ట‌!

సుఖేష్ చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్న‌ 200 కోట్ల  రూపాయ‌ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది.  

పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తై, చార్జిషీటు దాఖలు చేసినందున ఆమె కస్టడీ అవసరం లేదని ఈ హీరోయిన్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించారు న్యాయ‌వాదులు. దీంతో కోర్టు రూ. 2 లక్షల పుచిక‌త్తుపై బెయిల్ మంజూరు చేసింది.

ప్రముఖులు, వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లకు పడగలెత్తిన సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు రావ‌డంతో రూ.200 కోట్ల చీటింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో న‌మోదు చేశారు. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అప్ప‌ట్లోనే అరెస్టును త‌ప్పించుకునేలా ఈమె మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు పొందింది.

ఈ కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కూడా ఈడీ అనేకసార్లు సమన్లు ​​పంపి విచార‌ణ కూడా చేసింది. సుఖేష్ మోసగాడని జాక్వెలిన్‌కు ముందే తెలుసని విచార‌ణ సంస్థ భావిస్తోంది.