ఒక దశలో రాజకీయ నేతగా ఎన్టీఆర్ వ్యవహారశైలిపై వరస పెట్టి సెటైరిక్ సినిమాలు తీయించారు కృష్ణ. మండలాదీశుడు, సాహసమే నా ఊపిరి వంటి సినిమాల వెనుక పద్మాల స్టూడియో ఉంది, సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. నటుడు ప్రభాకర్ రెడ్డి, కృష్ణలు ఆ సినిమాలకు కీలకంగా వ్యవహరించారు.
మరి ఎన్టీఆర్ పై అలాంటి సెటైరిక్ సినిమాలు తీయడమే పెద్ద సాహసం. అలాంటి ప్రయత్నాల విషయంలో కృష్ణ ఎలాంటి బెరుకు లేకుండా వ్యవహరించారని చరిత్ర చెబుతోంది.
మరి వేరే వాళ్లపై ఇలాంటి సెటైర్లు వేయడం సంగతెలా ఉన్నా.. మరి తనపై అలాంటి సెటిరక్ పాత్రే వస్తే? ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా.. దుబాయ్ శీనులో ఫైర్ స్టార్ సాల్మాన్ రాజు పాత్రకు ఇన్ స్పిరేషన్ సూపర్ స్టార్ కృష్ణే అనే టాక్ మొదట్లోనే వచ్చింది.
ఆ పాత్ర కల్ట్ హిట్ అయ్యింది. ఆ తర్వాతి కాలంలో ఆ పాత్రను ధరించిన ఎమ్మెస్ నారాయణ ఆ సెటిరిక్ హీరో పాత్ర కు ఇన్ స్పిరేషన్, తన డైలాగ్ డెలివరీ అంతా సూపర్ స్టార్ కృష్ణకు అనుకరణే అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.
అంతే కాదు.. ఇదే విషయంపై కృష్ణ తన వద్ద స్పందించారని కూడా ఎమ్మెస్ నారాయణ చెప్పారు. తనపై సెటైర్ ను కృష్ణ చాలా తేలికగా తీసుకున్నారని.. 'భలే చేశావయ్యా..' అంటూ తనతో నవ్వుతూ స్పందించారని కూడా ఎమ్మెస్ వివరించారు.
తనకు వచ్చిన డ్యాన్స్ నే చేయడం, సెట్లో హీరోయిన్ తో రొమాన్స్, ఫన్నీ అనిపించే హీరోయిజం.. వీటన్నింటినీ సాల్మాన్ రాజు పాత్రలో దట్టించారు. అది తనపై సెటైర్ అనిపించినా కృష్ణ ఊగిపోయింది లేదు. సదరు నటుడితో సరదాగానే స్పందించారు. అంతే కాదు.. ఆ పాత్రను రాసిన రచయిత, ఆ పాత్రను తీసిన దర్శకుడితో ఆ తర్వాతి కాలంలో మహేశ్ కూడా సినిమాలు చేశారు కూడా!