సినీ నిర్మాణంలో, తెలుగు తెరపై ప్రయోగాల్లో సాహసానికి మరో పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఇది ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడూ ఒప్పుకునే సత్యం. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ అరుదైన కథ, నిర్మాణ, పాత్ర ప్రయోగాలను చేయడమే కాకుండా.. సూపర్ స్టార్ కృష్ణ వేగంగా సినిమాలను రూపొందించడంలో కూడా ముందు వరసలో నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కృష్ణ చేసినంత వేగంగా తెలుగులో మరే హీరో సినిమాలను పూర్తి చేయలేదు!
ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాల్లో హీరోగా నటించడం విషయంలో కూడా కృష్ణదే ఆల్ టైమ్ రికార్డు. 1972లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మొత్తం 18 సినిమాలు వచ్చాయనే లెక్క ఉంది. తెలుగు వరకూ ఇదే ఒక హీరోకు సంబంధించి అత్యధిక సినిమాల విడుదల రికార్డు. ఈ సినిమాలన్నింటిలోనూ కృష్ణ హీరో పాత్రలో నటించారు.
ఆ తర్వాత తెలుగులో ఈ తరహాలో కృష్ణకు సాటి, పోటీ వచ్చిన హీరో మరొకరు లేరు. ప్రత్యేకించి గత దశాబ్దంన్నర కాలం నుంచి అయితే స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గొప్ప అయిపోయింది! అది వేరే సంగతి. బహుశా గత దశాబ్దంన్నరలో ఒకే ఏడాది అత్యధిక విడుదలలను కలిగిన హీరో అల్లరి నరేష్. 2008 సంవత్సరంలో నరేష్ సినిమాలు ఎనిమిదో తొమ్మిదో విడుదలయ్యాయి. కామెడీతో కూడిన చిన్న బడ్జెట్ సినిమాల హీరోగా అల్లరి నరేష్ ఆ ఫీట్ చేయగలిగాడు.
అయితే తెలుగు ఆవల చూస్తే ఒకే ఏడాది అత్యధిక సినిమాలు చేసిన హీరోలు మలయాళంలో కనిపిస్తారు. మలయాళీ స్టార్ హీరోలు వరస పెట్టి సినిమాలను పూర్తి చేయడంలో ముందుంటారు. ఇప్పటికీ అక్కడ స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇలా ఒకే ఏడాది అత్యధిక సినిమాల విడుదలలను పొందిన ఘనత మమ్ముట్టీది. తన కెరీర్ లో ఇప్పటికే సుమారు నాలుగు వందల కు పైగా సినిమాలు చేసిన మమ్ముట్టీ.. 1982లో ఏకంగా 24 సినిమాల్లో నటించాడు! ఇవన్నీ లీడ్ రోల్సే!
అలాగే 1983, 86 సంవత్సరాల్లో కూడా ఒక్కో ఏడాదికి మమ్ముట్టీ సినిమాలు 30కి పైగా విడుదలయ్యాయి, వీటిల్లో కొద్ది సేపు కనిపించే పాత్రలు, మల్టీ స్టారర్లున్నాయి. వేగంగా సినిమాలు చేయడంలో మమ్ముట్టీనే కాదు మలయాళీ హీరో మోహన్ లాల్ కూడా ముందు వరసలోనే నిలుస్తారు.
తెలుగు వరకూ అయితే కృష్ణ ఒక్కరికే ఇది సాధ్యం అయ్యింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత మంది స్టార్ హీరోలు దొరుకుతారేమో కానీ, కృష్ణ మాత్రం ఒక్కరే!