‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ అంటూ అలరించే సినీ గీతాన్ని రాశారు వెనకటికి ఓ కవి. ఆయనే బతికుంటే ఇప్పుడు కాస్త వరస మార్చుకునేవారు. ‘మోడీజీ మాటలకు అర్ధాలే వేరులే’ అంటూ ఒక సరికొత్త కవితను సృష్టించి భారతదేశానికి అంకితం చేసేవారు.
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ఒక యజ్ఞంలా పాటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణి విషయంలో అనుసరిస్తున్న వైఖరి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయడానికి ఇక్కడకు వచ్చి ఆ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరించే ఆలోచన లేదు అని ప్రకటించారు నరేంద్ర మోడీ.
మోడీ మాటలను తెలంగాణ సమాజం ఎంత మేర నమ్మిందో మనకు తెలియదు కానీ, ఆయన ప్రకటించిన సంగతి వాస్తవం. అయితే ఇప్పుడు కొత్త గనులు అన్నిటినీ ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. కొత్త గనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. కొత్తగనులన్నింటినీ ప్రైవేటు వారి చేతుల్లో పెడితే కేవలం పాతగనులతో సింగరేణి మనుగడ సాగించడం అసాధ్యం.
ఇప్పటికే సింగరేణి ప్రాంతంలోని కోయగూడెం గని ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంకో మూడు బ్లాకులకు కేంద్రం టెండర్లు పిలవనుంది. గతంలో రెండు సార్లు ఇదే పని చేసినప్పటికీ ఎవరూ వేలానికి ముందుకు రాలేదు. ఆ నేపథ్యంలో ఆ మూడు బ్లాకులను తమకే ఎప్పటిలా నేరుగా అప్పగిస్తారని సింగరేణి ఎదురుచూస్తోంది. అలా జరగకపోగా తాజాగా మరోసారి కేంద్రం టెండర్లను పిలిచింది. ఈ మూడు బ్లాకులు కావాలని సింగరేణి సంస్థ కోరుకుంటే కనుక వారు కూడా వేలంలో పాల్గొని తీరాల్సిందే అని స్పష్టం చేసింది.
ప్రైవేటు కంపెనీలతో పోటీపడి ఘనులు దక్కించుకోవడం సింగరేణి సంస్థకు కష్టసాధ్యమైన విషయం. అలాగని కొత్త గనులు లేకుండా మనం కూడా సాగించడం కూడా కష్టం.
ఒకవైపు పాత గనుల్లో నిలువలు అడుగంటుతుండగా సంస్థ నడ్డివిరిచే లాగా కొత్త గనులను నేరుగా కేటాయించకపోవడం దారుణం అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన లేని లేదని ప్రకటించి వెళ్లిన కొద్ది రోజులకే మోడీ ఇలాంటి షాక్ ఇవ్వడం వారికి జీర్ణం కావడం లేదు.
ఒకవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అలజడి రేపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సింగరేణి గనులను టెండర్ల ద్వారా కేటాయించాలనే నిర్ణయంతో తెలంగాణ సమాజంలో మరో అలజడికి కారణం అవుతోంది. ఏపీలో తమకు దిక్కులేదని వారికి తెలిసినప్పటికీ, తెలంగాణలో అధికారం రాలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఈ పార్టీ ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నదో అర్థం కావడం లేదు.