‘మైలేజీ బాగుంది.. పచ్చమీడియా మనల్ని భుజాన మోస్తోంది.. మనకు చీమకుట్టినా సరే.. ఏనుగు తొక్కినంతగా హడావుడి చేస్తోంది.. ఇలాంటి సమయాలనే మనం సద్వినియోగం చేసుకోవాలి.. ఈ జోరు రాష్ట్రమంతా చూపించండి.. రచ్చరచ్చ చేయండి.. ప్రతిచోటా గొడవలు పడండి.. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం..’ ఇదే ప్రస్తుతం జనసేన ఎజెండా!
రాజమండ్రి వద్ద వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఘర్షణగా, దాడికి యత్నంగా, దాడిగా రూపాంతరం చెంది, పచ్చమీడియాలో చాలా ప్రముఖంగా ప్రచారం జరిగింది. ఇది జనసేనకు అనూహ్యమైన మైలేజీ. అందుకే.. ఇదే బాటలో రాష్ట్రమంతా చెలరేగిపోతే మరింత మైలేజీ గ్యారంటీ అని జనసేన తలపోస్తోంది.
అసలే రాష్ట్రంలో పార్టీ స్తబ్దుగా ఉంది. తెలుగుదేశం పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో.. కిందిస్థాయి జనసేన నేతలు, కార్యకర్తలు.. ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆచితూచి డబ్బు ఖర్చు పెడుతున్నారు. తాము ఖర్చు పెడతాం సరే.. రేపు తమ నియోజకవర్గమే తమకు కాకుండా పోతే ఎలా అనే భయం వారిని వెన్నాడుతోంది.
ఇలాంటి సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కట్టించి ఇచ్చే పక్కాఇళ్ల పరిస్థితిని పరిశీలించాలని.. పార్టీ జనసైనికులకు ఎజెండా నిర్దేశించింది. గ్రామాల్లో తిరిగి అంతా పరిశీలించాలనేది ప్రణాళిక. అలాంటి పనిలో పవన్ కూడా స్వయంగా పాల్గొన్నారు. నిజానికి పవన్ ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించిన కార్యక్రమానికి కూడా రానంత మైలేజీ, రాజమండ్రిలో వైసీపీ నేతలతో ఘర్షణ అనే పుకారుకు వచ్చింది.
మైలేజీ ప్రధానంగానే రాజకీయం అలరారే ఈ రోజుల్లో జనసేన ఆ ఎడ్వాంటేజీని అందిపుచ్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులకు సందేశాలు వెళ్లాయి. ప్రతిచోటా ఇళ్ల పరిశీలన పేరిట వివాదాలు ఘర్షణల రూపం దాల్చేదాకా శృతిమించి వ్యవహరించాలనేది వారి సందేశం.
ఎవడు పడితే వాడు వచ్చి ప్రభుత్వాన్ని లెక్కలు అడగడానికి లేదు. దానికో పద్ధతుంది. ఆర్టీఐ ప్రకారం అడిగితే.. వివరాలు పద్ధతి ప్రకారం వస్తాయి. అంతే తప్ప రాజకీయ రుబాబు చేస్తామంటే కుదరదు. ఈ క్లారిటీ జనసేనకు లేక కాదు. కానీ వాళ్లకు కావాల్సింది.. ప్రజా ప్రయోజనం కాదు.. కేవలం రాద్ధాంతం. అందుకే ఇలా చెలరేగుతున్నారు.
కొసమెరుపు ఏంటంటే.. క్షేత్రస్థాయిలో ఇలాంటి వివాదాలను ఘర్షణలుగా దాడులుగా మార్చేసే, అలా రంగుపూసి భ్రమపెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. విధిగా వీరమహిళా కార్యకర్తలు కూడా ఉండాలని అంటున్నారట. దానివల్ల.. మహిళలపై దాడి జరిగినట్లుగా ఎదనపు ఎడ్వాంటేజీ ఉంటుందని కోరుకుంటున్నారట.