ప‌వ‌న్ ట్వీట్లు…బాబుకు మండిపోదా?

ప్ర‌ధాని మోదీని ఆకాశం హ‌ద్దుగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధాని మోదీతో దిగిన ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విశాఖ‌లో ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.…

ప్ర‌ధాని మోదీని ఆకాశం హ‌ద్దుగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధాని మోదీతో దిగిన ఫొటోల‌ను ఆయ‌న షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విశాఖ‌లో ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 35 నిమిషాల పాటు వాళ్లిద్ద‌రి ఏకాంత చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అంతా మంచి జ‌రుగుతుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో మోదీతో భేటీపై ఆయ‌న ఆనందాన్ని, కృత‌జ్ఞ‌త‌ల‌ను వెల్ల‌డిస్తూ ట్వీట్ చేయ‌డం విశేషం. ప్ర‌ధానితో భేటీ త‌ర్వాత రెండు రోజుల ఆల‌స్యంగా అయినా బీజేపీ మ‌న‌సు చూర‌గొనేలా ప‌వ‌న్ ట్వీట్లు చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్ ట్వీట్లు చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నేత‌ల‌కు కోపం తెప్పించేలా వున్నాయి. ఎందుకంటే ఆ ట్వీట్ల‌ను గ‌మ‌నిస్తే… త‌మ‌తో ప‌వ‌న్ రార‌నే అనుమానం టీడీపీని వేధిస్తోంది. ఒక్కో అంశంపై ప్ర‌ధాని గురించి ప‌వ‌న్ ట్వీట్ల‌ను ప్ర‌త్యేకంగా పెట్టారు. అన్నిటిని క‌లిపి ఏం చెప్పారో తెలుసుకుందాం.

‘క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని ఆదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారు. ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ.  ‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయి. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధాని కార్యాలయానికి ధన్యవాదాలు’ అని పవన్ పేర్కొన్నారు.

ఒకే ఒక్క భేటీతో బీజేపీపై ప‌వ‌న్ దృక్ప‌థంలో మార్పు వ‌చ్చింద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలిగా మోదీకి కితాబిచ్చారు. అస‌లే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రిపై గుర్రుగా ఉన్న చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల పుండుపై ఈ ట్వీట్ కారం చ‌ల్లిన‌ట్టుగా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్ త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేయ‌కుండా, గోడ‌మీద పిల్లిలా త‌మ‌తో ఆడుకుంటున్నాడ‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇంత కాలం బీజేపీ అగ్రనేత‌లు ప‌ట్టించుకోలేద‌నే అల‌కే త‌ప్ప‌, వారిపై కోపంతో కాద‌ని అర్థ‌మ‌వుతోంద‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తు న్నారు. ప‌వ‌న్ పిల్లిమొగ్గ‌ల‌పై చంద్ర‌బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు టీడీపీ నేత‌లు అంటున్నారు. ప‌వ‌న్‌తో జాగ్ర‌త్త‌గా వుండాల‌ని తాజా ప‌రిణామాలు గుణ‌పాఠం నేర్పుతున్నాయ‌ని టీడీపీ నేత‌లు చెబుతుండ‌డం విశేషం.