ఒకప్పుడు అంటే దశాబ్దాల కిందట..తమిళనాడు రాజకీయాలు చూసి మిగిలిన రాష్ట్రాల జనం అబ్బుర పడేవారు. అప్పట్లో ఎంజిఆర్, కరుణానిధి శకం నడిచేది. కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా, ఎన్నికల టైమ్ లో కొట్లాడేవారు. వన్స్, ఎన్నికలు అయిపోయాక కేంద్రంతో చాలా సఖ్యతగా వుండేవారు. అది ఎంజిఆర్ ప్రభుత్వం అయినా, కరుణానిధి ప్రభుత్వం అయినా. దానివల్ల పరిశ్రమలు, పెట్టుబడులు తమకు ఎలా కావాలంటే అలా సాధించుకునే వారు. ఇది కదా తమిళ జనాల తెలివి అని అప్పట్లో ఆంధ్ర జనాలు కామెంట్ చేసేవారు.
సరే అది ఆ కాలం. ఇప్పుడు అంతా రొచ్చు రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మీడియా అనేది బిళ్ల బీటుగా నిలువుగా కాకుండా, పూర్తిగా పార్టీలకు సాష్టాంగం పడిపోతున్న, పడిపోయిన రోజులు వచ్చాయి. అందుకే చిత్రాతి చిత్రంగా వార్తలు వండి వారుస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం యాంటీ మోడీ ప్రభుత్వం నడుస్తోంది. దాంతో అక్కడ పరిస్థితులు కకా వికలుగా వున్నాయని, వ్యాపారాలు చేసుకునే వారు ఇడి..ఐటి దాడులకు భయపడుతున్నారని,కేసీఆర్ యాంటీ మోడీ స్టాండ్ సరి కాదని సుద్దులు చెబుతున్నారు. కానీ అదే ఆంధ్ర దగ్గరకు వచ్చేసరికి సిఎమ్ జగన్ తన కేసుల కోసం మోడీకి భయపడి, సాష్టాంగం పడిపోతున్నారని రాస్తున్నారు.
ఇక్కడేమో యాంటీ మోడీ విధానాల వల్ల కంపెనీలు రావడానికి భయపడుతున్నాయంటున్నారు. అక్కడ సంస్థలు రాకపోయినా, మోడీని నిలదీయడం లేదంటున్నారు.
అంటే అసలు సమస్య ఏమిటంటే ముందుగా ఈ ఎల్లో మీడియాకు మోడీ కావాలి. కానీ సదరు మోడీ మాత్రం జగన్ తో జత కట్టకూడదు. తెలంగాణలో కేసీఆర్ తో, ఆంధ్రలో చంద్రబాబుతో జతకట్టాలి. అప్పుడు అలా చేస్తే అది వివేకం అనిపించుకుంటుంది. అలా కాకుండా కేసీఆర్ నేరుగా మోడీని ఢీకొన్నా తప్పే. జగన్ వెళ్లి మోడీతో జతకట్టినా తప్పే.
కానీ ఈ ఎల్లో మీడియాకు తెలియంది ఏమిటంటే, ఏం రాస్తే అది చదివేసి, జనం గొర్రెల్లా అటే వెళ్లిపోయే కాలం చెల్లిపోయింది. తెలంగాణలో మోడీతో వెళ్లమని, ఆంధ్రలో మోడీతో వెళ్లడం సరి కాదని అంటే గ్రహించని అమాయకులు కాదు జనం. వాళ్లకు ఏ మీడియా ఎవరితో తాళి కట్టించుకుందో, ఎవరితో సంసారం చేస్తోందో తెలిసిపోయింది. అందువల్ల ఇదంతా వృధా ప్రయాసే.