సొంత ఊరిలో చిత్తుచిత్తుగా.. బాబు పరాజయం పరిపూర్ణం

అపజయాలు ఎలా ఉంటాయో, చారిత్రాత్మక ఓటమి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పటికే బోధపడింది. 2019 ఎన్నికల్లో చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూశారు చంద్రబాబు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల రూపంలో మరో…

అపజయాలు ఎలా ఉంటాయో, చారిత్రాత్మక ఓటమి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పటికే బోధపడింది. 2019 ఎన్నికల్లో చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూశారు చంద్రబాబు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల రూపంలో మరో పరాభవం ఎదురైంది. 

ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ తో చంద్రబాబు ఓటమి పరిపూర్ణం అయింది. ఈసారి తన సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపించలేకపోయారు చంద్రబాబు.

ఇన్నాళ్లూ తనకు కంచుకోటగా భావించిన కుప్పం నియోజకవర్గంలోనే బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా అలాంటిలాంటి దెబ్బ కాదు. కనీసం హీనస్థాయిలో పోటీనిచ్చే స్థితిలో కూడా టీడీపీ లేదంటే.. కుప్పంలో బాబు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలుంటే.. అన్ని మండలాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలుంటే 17 వైసీపీ వశమయ్యాయి. అటు గుడిపల్లెలో 12కి 12.. రామకుప్పంలో 16కి 16 ఎంపీటీసీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇదే బాటలో జడ్పీటీసీ ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

స్వయంగా తన సొంత ఊరు నారావారిపల్లెలో చంద్రబాబు ఓడిపోయారు. నారావారిపల్లెలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరంపై, వైసీపీ అభ్యర్థి రాజయ్య భారీ మెజారిటీతో గెలిచారు. అటు చంద్రబాబు నియోజకవర్గ కేంద్రం కుప్పంలోని సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి 23 ఏళ్ల అశ్విని కైవసం చేసుకున్నారు. ఈ రెండు ఓటమిలతో చంద్రబాబు పరాజయం పరిపూర్ణం అయింది.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే, అంతా ఊహించినట్టే ప్రతి జిల్లాలో 90శాతం ఎంపీటీసీ స్థానాలు వైసీపీ కైవశం అవుతున్నాయి. కడప, నెల్లూరు లాంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.