సీఎం జగన్ పై ఈగ వాలనీయకుండా కాపు కాసే బ్యాచ్ లో మినిస్టర్ అనిల్ ఒకరు. అయితే ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత కారణాలతో మీడియాకు దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఎవరికీ అందుబాటులో లేరని సమాచారం.
చాన్నాళ్ల గ్యాప్ తర్వాత అనిల్ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. వస్తూ వస్తూనే ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అనిల్. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. వారిని గెలిపించుకునే ధైర్యం అచ్చెన్నకు ఉందా అని ప్రశ్నించారు.
ఇంతకీ అచ్చెన్న ఏమన్నారు..?
పరిషత్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదలవుతాయని తెలిసినప్పుడే టీడీపీ ఓటమి సాకుల కోసం వెదకడం మొదలు పెట్టింది. అనుకున్నట్టుగానే ఈ ఫలితాల్లో వైసీపీ ఘన విజయం, టీడీపీ ఘోర పరాభవం రెండు లాంచనాలూ పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసిందని ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ ని మీడియా ముందు చదివి వినిపించారు అచ్చెన్నాయుడు.
వైసీపీ తీరు వల్లే పరిషత్ ఎన్నికలను టీడీపీ బరిష్కరించిందని, అధికారులు, పోలీసుల సహకారంతోనే వైసీపీకి విజయం సాధ్యమైందని నిందలు వేశారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కావంటున్నఅచ్చెన్న, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు.
అచ్చెన్న అలా రెచ్చిపోయారో లేదో, అనిల్ వెంటనే తగులుకున్నారు. కౌంటింగ్ ని అడ్డం పెట్టుకుని కుంటి సాకులు చెప్పొద్దంటూ కోటింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మించి ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో వైసీపీ సత్తా చూపించిందని చెప్పారు మంత్రి అనిల్. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా హైదరాబాద్ కి పరిమితం అయితే మంచిదని అన్నారు.
80 శాతానికి పైగా మున్సిపాల్టీలు, పంచాయతీల్లో 60శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నికయ్యారని, టీడీపీకి నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతోనే వారు పోటీకి వెనకడుగేశారని మండిపడ్డారు. ప్రజాభిప్రాయం మరోసారి తెలుసుకోవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతుంటే, టీడీపీ ఎమ్మెల్యేలంతా వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు మంత్రి అనిల్. తిరిగి వారందర్నీ గెలిపించుకునే సత్తా అచ్చెన్నాయుడికి ఉందా అని ప్రశ్నించారు.
దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటున్న అచ్చెన్న, ముందు తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని, ఉప ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
మొత్తమ్మీద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సందర్భంగా మరోసారి రాజీనామాల కలకలం రేగింది. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే, మీరంతా రాజీనామాలు చేసి తిరిగి గెలవగలరా అంటూ వైసీపీ నేతలు ప్రతి సవాల్ విసురుతున్నారు.